
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా దేశమంతటా భారత ప్రభుత్వం సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం దేశం నలుమూలల నుండి ఎంపిక చేసిన యువ ప్రతినిధులతో ఈ నెల నవంబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు వారం రోజుల పాటు యూనిటీ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి హుజురాబాద్ మండలం, చిన్నపాపయ్యపల్లె గ్రామానికి చెందిన యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఎంపికయ్యారు. గతంలో నరెడ్ల ప్రవీణ్ రెడ్డి విద్యార్థి నాయకునిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమించి, ప్రస్తుతం యువమోర్చాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సందర్భంగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ 23 నవంబర్ న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమై నాగపూర్, ఇండోర్ మీదుగా గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వరకు వేలాదిమందితో ఐక్యతా యాత్ర ముగుస్తుందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముక్కలుగా ఉన్న దేశాన్ని, 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, వారి స్పూర్తితో దేశమంతా ఐక్యతగా ఉండాలని, వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. గుజరాత్ లో జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యి ఐక్యతా సందేశాన్ని దేశప్రజలకు ఇస్తారని తెలిపారు.
భారత ప్రభుత్వం తరపున కరీంనగర్ జిల్లా నుంచి యూనిటీ మార్చ్ కి ఎంపిక చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి,ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

బిజెపి యువ నాయకుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి





