
– ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన పరికరాలను వాడుకోకుంటే వాపస్ తీసుకుంటానని స్పష్టీకరణ
– అతి త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ
– స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా
– మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఆసుపత్రుల్లో సూది, మందులు, దూది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన సందర్శించారు. దాదాపు రూ.కోటి విలువైన వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు. ఆ సేవలను కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ కోసం వచ్చేది పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే. వాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేసుకునే స్థోమత ఉండదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని నరేంద్రమోదీ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులిస్తోంది. ప్రజలకు వైద్య సేవల పట్ల భరోసా ఇచ్చేందుకు యత్నిస్తోంది. దురద్రుష్టమేందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సరిగా ఉపయోగించడం లేదు. ఆసుపత్రికి వెళితే సూదులు, మందులు, దూది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకుండా పోతోంది.
ఈ పరిస్థితిపై గతంలో నేను రివ్యూ చేశాను. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్లు బయటకు వెళ్లకుండా పూర్తిస్థాయిలో సేవలందించాలంటే ఏం చేయాలని అడిగాను. డాక్టర్లు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల మేరకు నా బర్త్ డే నాడు రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించాను. వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ఎండీసీ సంస్థ సాయంతో ఆధునాతన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించాం. అందులో భాగంగా జమ్మికుంట సామాజిక వైద్య శాలకు ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్, డయాథెర్మి మిషన్, అనెస్తిషియా, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ, సిరంజ్ పంప్ సహా మొత్తం 15 పరికరాలను అందించాను. ఇకపై జమ్మికుంట ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఎంపీ లాడ్స్ నుండి ఎక్స్ రే మిషన్ ను కూడా అందజేస్తా. దయాచేసి ఆ పరికరాలను రోగుల కోసం వినియోగించుకోవాలి. పట్టించుకోకుంటే మాత్రం వాటిని వాపస్ తీసుకుని పోయి ఇతర చోట్ల అందిస్తా. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకుని వస్తే…వారికి పైసా భారం లేకుండా చికిత్స చేసి పంపాలని కోరుతున్నా. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు నెంబర్ వన్ గా ఉండేలా చూడాలని కోరుతున్నానన్నారు.
దురద్రుష్టం ఏమిటంటే…. కొన్ని చోట్ల అంబులెన్సులు ఇచ్చినా వాడుకోవడం లేదు… అట్లయితే వాపస్ తీసుకుని వేరేవాళ్లకు ఇస్తా. వేములవాడ, కరీంనగర్ ఆసుపత్రుల్లో ఇట్లనే చేస్తే వాటిని వాపస్ చేసి వేరే ఆసుపత్రులకు పంపిన. ఇట్లయితే పేదలకు వైద్య సేవలు అందేది ఎట్లా? ఇది సరికాదు. డాక్టర్లు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలి అని పేర్కొన్నారు.
చెక్ డ్యాం కూలిపోవడంపై స్పందిస్తూ…
చెక్ డ్యామ్ లు ప్రజల కోసం, రైతుల కోసం కాదు. కమీషన్ల కోసం చెక్ డ్యామ్ లను కడుతున్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగడం లేదు. కమీషన్లు ఇస్తున్నారు. నాసిరకం పనులు చేస్తున్నారు. ఆ చెక్ డ్యామ్ లు కూలిపోతున్నారు. ప్రణాళిక లేకుండా క్వాలిటీతో పనిలేకుండా చెక్ డ్యామ్ లు నిర్మించారని గత 6 నెలలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టించుకోవడం లేదు. గతంలో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోనూ చెక్ డ్యాంలు కూలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే చెక్ డ్యాంల కూలిపోవడంపై విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అట్లాగే కాంట్రాక్టర్ ఆస్తులను సీజ్ చేయాలి. అప్పుడే వాళ్లలో భయం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లు తప్ప ఇంకోటి పట్టడం లేదు. బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేసిన వాళ్లకు కూడా పైసలు తీసుకుని మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారు. బీఆర్ ఎస్ కూడా ఇది గ్రహించి పైసలిచ్చి పంపిస్తున్నారు.
జమ్మికుంటకు స్పోర్ట్ స్టేడియం నిర్మాణం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు రడీ చేస్తున్నారు, త్వరలోనే ఈ రెండు పనులను పూర్తి చేస్తాం అని అన్నారు.





కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి నూతన యంత్రాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, పక్కన కలెక్టర్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి..
సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం
రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన కేంద్ర మంత్రి
జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు రూ.కోటి చొప్పున విలువైన వైద్య పరికరాల అందజేత
జిల్లా కలెక్టర్ తో కలిసి జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి
పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్న డాక్టర్లు
ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందించండి
డాక్టర్లను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్
సొంత నిధులు, సీఎస్సార్ ఫండ్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తానని హామీ
‘‘దయచేసి ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దు. వారిపై భారం మోపద్దు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలు. వారికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స చేసి పంపేలా చర్యలు తీసుకోండి.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమర్ కోరారు. ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయల అత్యాధునిక వైద్య పరికరాలను సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసి అందించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలను అందించారు. ఆయా పరికరాల సేవలను ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ప్రారంభించారు. కాసేపట్లో హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సందర్శించనున్నారు.
వాస్తవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు టెన్త్ క్లాస్ చదివే దాదాపు 20 వేల మంది విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన సంగతి తెలిసిందే త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ స్కూళ్లలో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తో కూడిన కిట్స్ ను మోదీ గిఫ్ట్ పేరుతో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు సీఎస్సార్ నిధులతోపాటు పలువురు వ్యాపారులు, దాతల సాయంతో నిధులు సమకూరుస్తున్నారు.
తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా బండి సంజయ్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అందులో భాగంగా జాతీయ ఖనిజాభివ్రుద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) రూ.4 కోట్ల నిధులను సేకరించి వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించారు. వేములవాడలో రూ.1.5 కోట్ల వ్యయంతో దాదాపు 16 వైద్య పరికరాలను అందించిన బండి సంజయ్ ఇటీవల వేములవాడ పర్యటనలో భాగంగా ఆ ఆసుపత్రిని సందర్శించి ఆయా వైద్య సేవలను ప్రారంభించారు.
తాజాగా ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కాసేపట్లో హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి అక్కడ ఒక్కో ఆసుపత్రికి రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి అందించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలు వీటిలో ఉన్నాయి. ఆయా పరికరాల సేవలను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
గతంలో కరీంనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సైతం తన బర్త్ డే కానుకగా దాదాపు రూ.3 కోట్ల విలువైన అంబులెన్సులు, ఎక్స్ రే మిషన్ సహా అత్యాధునిక వైద్య పరికరాలను బండి సంజయ్ అందించిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో తన సొంత ఖర్చుతో వాటికి అయ్యే మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా బండి సంజయ్ చెల్లిస్తుండటం గమనార్హం. వారి వెంట జమ్మికుంట, హుజురాబాద్ ఆసుపత్రుల సూపరిండెంట్లు డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి ఎన్ నారాయణరెడ్డి, వైద్యులు, సిబ్బంది, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

హుజురాబాద్ ఆస్పత్రిలో వైద్యులకు సలహాలు సూచనలు చేస్తున్న కేంద్రమంత్రి బండి..






జమ్మికుంట హుజురాబాద్ ఆసుపత్రి సందర్శించి నూతన పరికరాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి బండి, వెంట ఉన్న కలెక్టర్ ప్రమీల సత్పతి ఆసుపత్రుల సూపరిండెంట్లు..





