
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని మున్సిపాలిటీ పార్కులో హుజురాబాద్ దివ్యాంగుల మండల కమిటి సభ్యులు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా దివ్యాంగ సమాచారం వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవుల శ్రీనివాసు హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యాంగులుగా పిలవబడే మనము ఇతరుల కంటే తక్కువ కాదు అని, మన ప్రతిభ, పట్టుదల, ధైర్యం ఇతరులకు ప్రేరణ కావాలన్నారు. మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలనీ, దివ్యాంగత్వం శరీరంలో ఉంటుంది… కానీ బలహీనత మన ఆలోచనలో ఉంటుందన్నారు. మన ఆలోచనలు బలంగా ఉంటే, ఏ అడ్డంకినైనా మనం దాటగలం అని అన్నారు. మన చుట్టూ ఉన్న దివ్యాంగులను ఒకరినొకరు ప్రోత్సహించుకోవలన్నారు. మాకు కుడా అవకాశాలు ఇవ్వండి… మా మాటలు కూడా వినండి… మాతో కలిసి నడవండి… అప్పుడే మన సమాజం నిజంగా సమానత్వం ఉన్న సమాజం అవుతుందన్నారు. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తూ దివ్యాంగుల జీవితంలో మార్పు తీసుకురావడమే నాకు పెద్ద ఆనందం అన్నారు. దివ్యాంగులను దయతో కాదు, గౌరవంతో చూడాలనీ, అంతర్జాతీయ దినోత్సవం ఏర్పాట్ల దృష్ట్యా ప్రభుత్వం చిన్నచూపు తగదన్నారు. ఇక ముందు ఇట్టి కార్యక్రమాలను ప్రభుత్వం జిల్లా స్థాయిలలో కాకుండా అన్ని గ్రామ స్థాయిలలో కుడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. హుజురాబాద్ దివ్యాంగుల మండల కమిటీ అధ్యక్షులు కే. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన సమాజంలో ఉన్న దివ్యాంగుల ప్రతిభను, ధైర్యాన్ని గుర్తించే రోజు అన్నారు. దివ్యాంగుల దీనావస్తలను, సమస్యలను గూర్చి మాట్లాడారు. పించన్లు పెంచుతామని నమ్మబలికి గద్దెనెక్కి రెండేళ్ళు గడిచినా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ పించన్లు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంతెన తిరుపతి, గోపిడి రాజిరెడ్డి, వెంకన్న(చీకోటి వెంకటరమణ), సంపత్, అనుష, స్వప్న, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ పార్కులో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకుంటున్న దివ్యాంగుల మండల కమిటి సభ్యులు





