Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల బీసీల పై అరాచకాలు, అణచివేతలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని బీసీ ఆజాదీ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటన మరువక ముందే హైదరాబాద్ లోని క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట సాయి ఈశ్వరచారి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మృతి చెందాడని, దీనికి కారణం ఈ ప్రభుత్వాలే అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ, అడుగడుగునా బీసీలను మోసం చేయడం జరుగుతుందని, నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు, అరాచకాలు, అణచివేతలకు కారణం ఈ ప్రభుత్వాలే అని స్పష్టం చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలను రెండు ప్రభుత్వాలు ఘోరంగా మోసం చేశాయని, రానున్న రోజుల్లో బీసీల సత్తా చూపుతామని, బీసీలంతా ఐక్యంగా ఉండి తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఒకతాటిపైకి రావాలని, ఈ ప్రభుత్వాల మెడలు వచ్చి మన హక్కులను సాధిద్దామని పేర్కొన్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకొవద్దని, మనంతా ధైర్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించి, మన కలలను సాకారం చేసుకుందాన్నారు.

చికిత్స పొందుతూ మృతి చెందిన సాయి ఈశ్వరచారి





