
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
సమాజంలో ఉంటున్న బాలికలు భవిష్యత్తు బాగు కోసం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో బాలుర పాఠశాలలో, పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో స్నేహిత _2 కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ…విద్యను అభ్యసించే సమయంలో కిశోర బాలికలు పాఠశాలలో గాని ఇతర ప్రాంతాల్లో గాని వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటారని వాటిపట్ల అవగాహన ఉండాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్న విషయాలు స్పష్టంగా బాలికలకు అవగాహన ఉండాలని, ఎలాంటి సందర్భంలో బాలికల శరీరాన్ని తాకాలని ఎవరైనా చూసిన, మాటల ద్వారా ఇబ్బంది పెట్టిన ఆ విషయాన్ని 1091కు ఫోన్ ద్వారా గాని పాఠశాలలో ఏర్పాటుచేసిన బాక్స్ లో చిట్టి వేయాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న తల్లికి తెలియజేయాలని ఆయన కోరారు. ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మాయిలను శారీరకంగా కానీ మానసికంగా గాని ఇబ్బంది పెడితే మొదట ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలని, కానిపక్షంలో తల్లికి తెలియజేసి షీ టీంకు గాని తెలియజేయాలని ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. మేజర్ కానీ అమ్మాయిలపై ఎవరైనా ఇబ్బందులు పెడితే వారిపై ఫోక్సో కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, హుజురాబాద్ సిడిపిఓ మరాఠీ సుగుణ, ఏఎస్ ఐ కమల, వైద్యాధికారులు డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, హెచ్ఎం తిరుమల, హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి, సూపర్వైజర్ రమ్యరెడ్డి, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ..


పాఠశాలలో ఏర్పాటుచేసిన బాక్సులోని చీటీలను తీసి చూసి చదువుతున్న జిల్లా వైద్యాధికారి…





