
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
వైద్య సేవలకై వచ్చిన వారికి డాక్టర్లు సరైన వైద్య సేవలు అందించక, సూచనలు ఇవ్వక పోవడం వల్ల తాము నష్టపోయామని ఆరోపిస్తూ శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళన నిర్వహించారు. వారి కథనం ప్రకారం…వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత అనే గర్భిణీ స్త్రీ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రతినెల వైద్య పరీక్షల కోసం వచ్చేదని, ఈనెల 11న ఆమె బ్యాక్ పెయిన్ వస్తుందని ఆసుపత్రిలో వైద్యుల వద్దకు వచ్చిందన్నారు. వైద్యులు ఆమెను పరీక్షించి అంతా బాగా ఉందని చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్ళింది. సాయంత్రం వరకు రెండుసార్లు ఆమెకు బ్యాక్ పెయిన్ రావడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళింది. కాగా అక్కడ మృతిచెందిన శిశువును ప్రసవించింది. మృతి చెందిన శిశువు గత రెండు రోజుల క్రితమే ఆమె కడుపులో మృతి చెందాడని అక్కడే ఆసుపత్రి వారు చెప్పడంతో శుక్రవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ముందు డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆందోళన నిర్వహించారు. పేదల కోసం ఏర్పాటుచేసిన హాస్పిటల్లో పనిచేసే వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీ కడుపులో రెండు రోజుల క్రితమే శిశువు మృతి చెందితే పరీక్ష చేసిన డాక్టర్లు ఎందుకు తమకు తెలియజేయలేదని పేదలకు వైద్యం చేయడం పట్ల అంత నిర్లక్ష్యం ఏమిటని అన్నారు. తమకు వైద్య సేవలు అందించిన డాక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని ఇలా ఎంతమంది పేదలను నిర్లక్ష్యం పేరుతో ఇబ్బంది పెడతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అప్పుడైనా మరొక వ్యక్తికి ఏలాంటి అన్యాయం జరగదని వారన్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న లత కుటుంబ సభ్యులు, బంధువులతో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి మాట్లాడి నచ్చ చెప్పారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న శిశువులు మరణించడానికి అనేక కారణాలు ఉంటాయని, ఆమె కడుపులో రెండు రోజుల క్రితం శిశువు మృతి చెందింది అనడం వాస్తవమని, కేవలం ప్రభుత్వ ఆసుపత్రిని బదనాం చేసే ఉద్దేశంతో చెప్పిన మాటలని ఆయన అన్నారు. మీకు నమ్మకం లేకపోతే మృతి చెందిన శిశువు పోస్టుమార్టం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆయన అన్నారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మృతి చెందిన పసి కందును పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంపై హుజురాబాద్ ఏరియా ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న బాధితులు…





