
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని వారు ఆర్థికంగా బలపడడానికి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోనీ హుజురాబాద్ క్లబ్ లో ఇందిరా మహిళా శక్తి సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. గత రెండు సంవత్సరాలకు గాను 73,93,823/- రూపాయల చెక్కులు 553 మహిళా సంఘాల బీపీఎల్ కుటుంబాలకు మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని అందజేశామని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, పదేళ్ల నిరీక్షణ తర్వాత రేషన్ కార్డులు అందజేశామని, ప్రతి పేదవాడికి కడుపునిండా సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తామని, త్వరలోనే హుజురాబాద్ లో డబుల్ బెడ్ రూంలను పంచుతామని, పేదల ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్య, మున్సిపల్ అధికారులు, మెప్మా అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రణవ్ బాబు





మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రణవ్ బాబు





