
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
మంగళవారం ఓసి ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ హోటల్ శ్రీనివాస్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఓసి జేఏసీ ఉమ్మడి జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ
రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో
ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ పై కుట్రలు సాగనివ్వం…
రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమలబ్దికోసం చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని విరుచుకుపడ్డారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 27 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని సమావేశంలో పాల్గినా ఓసి జేఏసీ జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐకాస అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి కోరారు. మహాధర్నాకు సంబందించి గోడ ప్రతులను కర పత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఓసి ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు అండెం రమణారెడ్డి, మాదాటి శ్రీనివాస్ రెడ్డి, చిటుకుల రాజు, గడ్డం తిరుపతి రెడ్డి, చెన్నాడి మైపాల్ రెడ్డి, డెవరాజుల మనోహర్ శర్మ, ఆవోపా నమశ్శివాయ, తణుకు ప్రభాకర్, దడిగల వెంకటేష్వర్ రావు, కంకణాల వీరారెడ్డి, వెన్నమ విక్రమ నరసింహారావు చింతపల్లి రవీందర్ రావు, పీచర మనోహర్ రావు , ఉపేందర్, విష్ణుదాస్ గోపాల్ రావు, మిర్యాల ప్రసాద్ రావు తదితరులతో పాటు ఓసి ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.


ఐకాసా ఓసి ఉమ్మడి జిల్లాల నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు




మహా ధర్నాకు సంబందించి గోడ ప్రతులను కర పత్రాలను ఆవిష్కరిస్తున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఐకాసా ఓసి ఉమ్మడి జిల్లాల నాయకులు





