
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల 23న నిర్వహించే జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నాకు హాజరుకావాలని కోరుతూ హుజురాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ లకు మంగళ వారం హుజురాబాద్ లోనీ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ ఓసిల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 23న డిల్లీలో జాతీయస్థాయి ఓసిల మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో జనరల్ స్థానాల్లో సైతం ఓసిలు తట్టుకోలేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని పాడి కౌశిక్, బండ శ్రీనివాస్ ల దృష్టికి తెచ్చారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసిలకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుకబడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారికి కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలతో వాటి పైన దుష్ప్రచారం చేయడం తగదన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల పేదలకు ఆర్థిక స్థితి గతుల ఆధారంగా సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం జరగడానికి ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయటానికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామారావు వెంట పణ్యాల భూపతిరెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పోల్సాని రామారావు, గందే శ్రీనివాస్, కసిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, చందుపట్ల నరసింహరెడ్డి, కంకణాల జనార్ధన్ రెడ్డి, గౌతంశర్మ తదితరులతో పాటు హుజురాబాద్ నియోజక వర్గ ఓసి జేఏసీ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.



ఆహ్వాన పత్రికలను అందజేసి ఢిల్లీ మహా ధర్నాకు ఆహ్వానిస్తున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు





