
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి, 420లా వ్యవహరిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 14, 24 వార్డులకు చెందిన ఓటర్లతో గురువారం బోర్నపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
అసాధ్యమైన, అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసీ ఆర్ కు దక్కుతుందని అన్నారు.
రైతును రాజుగా చేసి, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తు చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించారన్నారు.
కళ్యాణ్ లక్ష్మి పథకంలో రూ.1,16,000తో పాటు తులం బంగారం గిప్టుగా ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో యూరియా బస్తాల కోసం కూడా రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, వికలాంగులకు రూ.6,000, వృద్ధులకు రూ.4,000 ఇస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే, మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడం తన బాధ్యతగా తీసుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ హుజూరాబాద్ మున్సిపల్ ఇంచార్జి పన్యాల భూపతి రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండ శ్రీనివాస్, 12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వర్ధినేని రవీందర్ రావు, 14 వ వార్డు అభ్యర్థి కేసబోయిన స్వామి, 24 వ వార్డు అభ్యర్థి కేశబోయిన ఓదేలు, రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లా రెడ్డి, సిర్సపల్లి సర్పంచ్ పోల్సాని రామారావు, ఎడవల్లి కొండాల్ రెడ్డి తదితర బిఆర్ ఎస్ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


కార్నర్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

ప్రజలకు అభివాదం చేస్తూ నమస్కరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





