
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసాయి. హుజురాబాద్ మునిసిపాలిటీలో 30 వార్డులు ఉండగా, పట్టణంలో 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి నిర్వహణ కోసం 700 మంది సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ ప్రశాంతత జరగడం కోసం హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి ఆధ్వర్యంలో పలువురు సిఐలు, ఎస్ఐలు పోలీసులు భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. హుజురాబాద్ పట్టణంలో బాలికల పాఠశాలలో పోలింగ్ ప్రారంభంలో ఓటర్లకు సందేహాలను పూర్తిచేసే హెల్ప్ డెస్క్ సిబ్బంది లేకపోవడంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రానికి రావడంతో పోలింగ్ అధికారులకు ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ ప్రారంభమైన బిఎల్వోలు గాని ఆర్వోలు గాని తమ సందేహాలు నివృత్తి చేయడానికి ఎందుకు సిద్ధంగా ఉండరని పలువురు ప్రిసైడింగ్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా ఎందుకు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కొద్ది సేపటికి బిఎల్వోలు రావడంతో సమస్య ముగిసింది. మాంటిస్సోరి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఒక అభ్యర్థితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పలువురు వారితో వాగ్వాదానికి దిగారు. తర్వాత సద్దుమణిగింది.
హుజురాబాద్ పట్టణంలోని 60 పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యమైన పలు పోలింగ్ కేంద్రాలను ఏసిపి వాసంశెట్టి మాధవి, అడిషనల్ డీసీపీలు సందర్శించి అక్కడున్న పోలీసులకు ఇతర సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించరాదని అన్నారు. కాగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీజేపీ నేత, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం (కరీంనగర్ జిల్లా) తన స్వస్థలమైన హుజూరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 30వ పోలింగ్ బూత్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
—విరివిగా వృద్ధుల ఓట్లు
హుజురాబాద్ పట్టణంలోని నాలుగో వార్డులో 97 సంవత్సరాల రామరాజమ్మ అనే వృద్ధురాలు, 17వ వార్డులో 95 సంవత్సరాల గంగాడి లింగారెడ్డి, 41వ బూతులో 80 సంవత్సరాల వయసు గల అయిత యశోద లు కుటుంబ సభ్యుల సహాయంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
—మందకోడిగా మొదలై ప్రశాంతంగా
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలు బుధవారం ఏడు గంటలకు ప్రారంభం గాక తొమ్మిది గంటల వరకు కేవలం 11. 70 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. మందకోడిగా మొదలైన పోలింగ్ 11 గంటల వరకు 30.40 శాతం నమోదు కాగా మధ్యాహ్నం ఒంటిగంటకు 52.90 శాతం నమోదు అయింది. మూడు గంటలకు 69.90 శాతం పోలింగ్ నమోదయింది. ఐదు గంటలకు పోలింగ్ శాతం..81.47 శాతం. నమోదు అయ్యింది. హుజురాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 29531 ఓట్లు ఉండగా అందులో పురుషులు 14357, మహిళలు 15170, నలుగురు అదర్స్ మంది ఉన్నారు. కాగా వీరిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 11,648 మంది, మహిళలు12,409 మంది , మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న వారు 24,060 ఉన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు బారులు తీరిన ఓటర్లు ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఉదయం పోలింగ్ మందకోడిగా ఉండడంతో అభ్యర్థులు పోలింగ్ ఎలా ఉంటుందోనని కొంత ఆందోళన చెందారు. పోలింగ్ రాని ఓటర్లకు ఫోన్ చేయడం, ఇతర మార్గాల ద్వారా వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం చేశారు. వృద్ధులు, యువతి యువకులు ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.


ప్రభుత్వ హైస్కూల్లో క్యూ లైన్ లో ఉండి ఓటు వేస్తున్న ఓటర్లు..

తల్లిదండ్రులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు..

ఓటు హక్కు వినియోగించుకున్న థర్డ్ జెండర్ లు

అమెరికా, సింగాపూర్ నుండి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారై యువతీ యువకులు..

ఆక్సిజన్ వెంటబెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నా వృద్ధురాలు..

ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి దంపతులు..

గుర్తుతెలియని యువకులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఏసిపి మాధవి..

పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలిస్తూ.. మెడిసిన్ తీసుకుంటున్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్‌రావు..

ఓటు హక్కు వినియోగించుకున్న సామాజిక సేవా కార్యకర్త బి మనోజ్ దంపతులు..

దివ్యాంగ భర్తను చేత పట్టుకుని ఓటు వేసేందుకు తీసుకువస్తున్న సతీమణి..

ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డేస్కూను సంప్రదిస్తున్న ఓటర్లు..





