
– ఓసీ సామాజిక, సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.. వెల్లడి.
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఓసిల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలోఓసిల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశ వ్యాప్తంగా అగ్రకులాలలోని పేద విద్యార్థినీ, విద్యార్థులు రైతులు, మహిళలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాజకీయాలకతీతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని, ఓసి కులాల స్థితిగతుల అధ్యయనానికి జాతీయస్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు పోలాడి రామారావు తెలిపారు.
23వ తేదీ ఉదయం 11గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ధర్నా కార్యక్రమం ఓసీలలోని వెనుకబడిన వర్గాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కను విప్పు కలిగే విధంగా ఉంటుందని రామారావు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఓసీలలోని నిరుపేదలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటిస్తారని
తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు అందజేసినట్లు వివరించారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అర్హత ఓకె విధంగా కలిగి ఉండాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అగ్రవర్ణ నిరుపేదలకు వర్తింప చేయాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లలో అన్ని వర్గాల పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని అందువల్ల రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయటానికి ప్రత్యేక చట్టం తేవాలని సూచించారు. ప్రస్తుతం 50శాతం దాటకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించుకునే విధంగా చట్టం తేవాలని, రైతులకు రైతు భీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించి రైతులు, వ్యవసాయ రైతు కూలీలకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఓసిల మహాధర్నాకు సంబంధించిన ఆహ్వాన పత్రిక..





