
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ లేబర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి (Assistant Labour Officer)డి. చందనను సస్పెండ్ చేస్తూ వరంగల్ జోన్ జాయింట్ లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్ అయిన హుజురాబాద్ ఏఎల్ఓ డి చందన
నిర్లక్ష్యం.. నిబంధనల ఉల్లంఘన:
కార్మిక శాఖలో కొద్దిరోజులుగా ఫైళ్ల కదలిక కోసం ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరిగిందని, లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లాగిన్ ఐడిలు, పాస్వర్డ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, కార్యాలయ రహస్యాలను బయటపెట్టడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన ఆరోపణలు:
కార్యాలయానికి సక్రమంగా హాజరుకాకపోవడం, రిజిస్టర్లలో సంతకాలు చేయకపోవడం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన క్లెయిమ్ ఫైళ్లను అనవసరంగా పెండింగ్లో ఉంచడం,
ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై కార్మికుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడటం, ప్రభుత్వ కంప్యూటర్లను, డేటాను అనధికారిక వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వడం,
ఈ అక్రమాలపై కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ మరియు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా కమిషనర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ‘సామాజిక బాధ్యతతో గతంలో ‘స్వర్ణోదయం’ వెలుగులోకి తీసుకురావడం వల్లే కార్మికులకు న్యాయం జరిగిందని పలు కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏఎల్ఓ చందనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంయుక్త కార్మిక కమిషనర్ వరంగల్ జోన్..





