
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి పొన్నంతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


–భారీ ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణుల సందడి
కార్యక్రమానికి ముందు హుజూరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. అంబేద్కర్ చౌక్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మార్గమధ్యలో మాజీ రాజ్యసభ సభ్యులు వొడితల రాజేశ్వర్ రావు, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నేతలు నివాళులు అర్పించారు. దశాబ్దాల కాలం తర్వాత హుజూరాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం పట్ల పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.


పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న చైర్పర్సన్ సుహాసిని

చైర్పర్సన్ కు పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

–అభివృద్ధికి రూ. 300 కోట్ల ప్రతిపాదనలు:
మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. “ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత అభివృద్ధే మా ధ్యేయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రాంతంతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక పనులు చేశానని గుర్తుచేస్తూ, భవిష్యత్తులోనూ ఈ ప్రాంతానికి ‘పెద్దన్న’లా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సమిష్టి కృషితోనే విజయం: వొడితల ప్రణవ్
నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే హుజూరాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం సంతోషకరమన్నారు. పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. హుజూరాబాద్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పర్యావరణం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి:
మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా కౌన్సిలర్లు, అధికారులు కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రజా పాలనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపులను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రవాణా శాఖ మంత్రిగా.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ సయ్యద్, బిజెపి ఫ్లోర్ లీడర్ పంజాల మనోజ్ (బంటి), గందే శ్రీనివాస్, హుజురాబాద్, కమలాపూర్ జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ అధికారులు, 30 వార్డుల కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు


మంత్రి పొన్నం ఇతర అతిథులతో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు..





