
–40 ఏళ్లుగా కరాటేలో ఎంతోమందికి శిక్షణనిచ్చిన రమేష్
–సింగాపూర్ కిట్స్ లో విధులు నిర్వహిస్తున్న కరాటే మాస్టర్
–సన్మానం అందుకున్న కరాటే రమేష్ కు పలువురి అభినందన
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి16 : కరీంనగర్లోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ కరాటే మాస్టర్ ఇందుర్తి రమేష్ కుమార్ ను ఘనంగా ఆదివారం రాత్రి సన్మానించారు. కరాటే రమేష్ బాల్యం నుండే కరాటే సాధన చేసారు. 1979లో నాడు హుజురాబాద్లో కరాటే నేర్చుకున్న అతికొద్ది మందిలో రమేష్ ఒకరు. ఆనాటి ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ సంస్థ శిక్షకులు మాస్టర్ సంపత్ కుమార్ వద్ద కరాటే శిక్షణ తీసుకున్నారు. అంచెలంచెలుగా కరాటేలో రాణిస్తూ.. 1987లో బ్లాక్ బెల్ట్ సాధించారు. గత 40 ఏళ్లుగా హుజురాబాద్ ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక బహుమతులు గెలుచుకోవడమే కాకుండా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అనేక మంది ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. 2010లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు “లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు” అందుకోవడం గమనార్హం. ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రమేష్ కుమార్ రిఫరీగా, జడ్జిగా వ్యవహరించారు. కరాటేలో రమేష్ గుర్తింపు పొందిన దృష్యా ఆయనను ఇప్పటికి హుజురాబాద్లో.. కరాటే రమేష్ గా అందరూ పిలుస్తారు. అయన ఇంటిపేరునే కరాటే గా మలుచుకున్నారంటే.. అతిశయోక్తి కాదు. కరీంనగర్లో ప్రారంభించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వాహకులు, జాతీయ స్థాయిలో కరాటేలో పేరు ప్రఖ్యాతులు పొందిన “షిహాన్” సంపత్ కుమార్, వసంత్ కుమార్.. రమేష్ కరాటే రంగానికి అందించిన సేవలను గుర్తించి, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సీనియర్ మాస్టర్ గా గుర్తించి ఘనంగా సన్మానించారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి తదితరులు కరాటే రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. గత పాతికేళ్లుగా రమేష్ సింగాపూర్ “కిట్స్” ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇండెక్స్ కార్యక్రమంలో కరాటే శిక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో సన్మానం అందుకున్న కరాటే రమేష్ ను మాజీ రాజ్యసభ సభ్యులు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే, కిట్స్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వి సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్, ప్రిన్సిపాల్ డా. కందుకూరి శంకర్, అధ్యాపకులు, సిబ్బందితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, పూర్వ విద్యార్థులు, మిత్రులు, అయన వద్ద శిక్షణ పొందిన వారు, హుజురాబాద్ కు చెందిన వివిధ రంగాల ప్రముఖులు అభినందిస్తున్నారు.

కరీంనగర్లో… “కరాటే రమేష్” కు ఘన సన్మానం





