
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి గ్రామ సరిహద్దు ప్రాంతంలో జనావాసాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని గత వారం రోజులుగా చేస్తున్న నిరసనల దీక్షలతో హుజురాబాద్ ప్రాంతంతో పాటు చుట్టు పక్క ప్రాంతాలకు ఉద్యమ సెగలు విస్తరించి మహోద్యమ రూపంగా మారే అవకాశాలు ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఆదివారం సామాజిక కార్యకర్త స్ధానిక 12వ వార్డు కౌన్సిలర్ వర్థినేని రవీందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష శిబిరంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జనావాసాల మధ్య చేపట్టే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
గుట్టు చప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలనే పాలకుల వైఖరిపై గత వారం రోజులుగా వివిధ వర్గాల వారు చేస్తున్న నిరసనలు హోరెత్తుతున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేక పోవడం ఇదేమి ప్రజా ప్రభుత్వ పాలన అని రామారావు ప్రశ్నించారు.
ఇక్కడ నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని గొప్పలు చెప్పే పాలకులు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే నీళ్ళు భూమిలోకి ఇనికి సాగుకు పనికి రాకుండా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజలకు పశువులకు, మత్స్య కార్మికులకు ప్రాణాంతకంగా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. వాతావరణంలోనే ఎన్నటికీ నషించని విషపదార్థాలు వెలువడి పాడి పంటల దిగుబడి తగ్గి అన్నదాతలకు తీవ్ర స్థాయిలో నష్టపోతారని, ప్రజలకు పశువులకు క్యాన్సర్ సోకి మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమస్యలు తలెత్తి హుజురాబాద్ ప్రాంతమే కాకుండా, జననాలు ఆగి పోతాయని తల్లి పాలు ఆవు పాలు విషమై కలుషితమై భవిష్యత్ తరాలు వారు వలస పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. హుజురాబాద్ ప్రాంతమే కాకుండా సమీప 4 జిల్లాల వరకు ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని తెలిపారు. అధికారులు పాలకులు మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేపట్టే ఇట్టి డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపి వేయాలని, జనావాసాలకు దూరంగా ఇట్టి డంపింగ్ యార్డు ప్రాజెక్టును తరలించాలని పోలాడి రామారావు, బండ శ్రీనివాస్, నాగార్జున డైరీ చైర్మన్ పుల్లూరి ప్రభాకర్ రావు, కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, పీఏసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, కౌన్సిలర్ బండ సింధూ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిషన్ రావు, సర్పంచ్ పోల్సాని రామారావు, గుడిపాటి జయపాల్ రెడ్డి, పలకల ఈశ్వర్ రెడ్డి, కే సుధాకర్ రావు, పాత్రికేయులు మండల యాదగిరి, విష్ణుదాస్ గోపాల్ రావు, సృజనుకుమార్, మతీన్, కొలిపాక సమ్మయ్య, తులసి లక్ష్మణమూర్తి, తాళ్ళపల్లి రమేష్ లతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున శిబిరంలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..

మాట్లాడుతున్న జేఏసీ నాయకుడు పలకల ఈశ్వర్ రెడ్డి..

మాట్లాడుతున్న 12వ వార్డ్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు..

మాట్లాడుతున్నా ఓసి జేఏసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..


మాట్లాడుతున్న సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి..







