
–మున్సిపల్, గ్రామ పంచాయతిల తీర్మానాలు.. -ఉదృతమవుతున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమం -ఆగని నిరసన జ్వాలలు.. – రోజు వారీగా తహసీల్దార్, ఆర్డీవో లకు వినతి పత్రాలతో వినూత్న పోరాటం..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంత సమీపంలో సిర్సపల్లి గ్రామ సరిహద్దు ప్రాంతంలో జనావాసాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని గత వారం రోజులుగా చేస్తున్న నిరసనల దీక్షలతో హుజురాబాద్ ప్రాంతంతో పాటు చుట్టు పక్క ప్రాంతాలకు ఉద్యమ సెగలు విస్తరించి మహోద్యమ రూపంగా మారి అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తి వారు కూడా ఉద్యమంలో పాల్గొనే పరిస్థుతులు నెలకొన్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, అఖిల పక్ష జేఏసీ చైర్మన్ ఆవునూరి సమ్మయ్యలు డిమాండ్ చేశారు.
స్ధానిక 6వ వార్డు కౌన్సిలర్ బండ సింధూజ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష శిబిరంలో అఖిల పక్ష జేఏసీ చైర్మన్ ఆవునూరి సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావులతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.


డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రజలు
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జనావాసాల మధ్య చేపట్టే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలనే పాలకుల వైఖరిపై గత 9 రోజులుగా వివిధ వర్గాల వారు చేస్తున్న నిరసనలు హోరెత్తుతున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేక పోవడం ఇదేమి ప్రజా ప్రభుత్వ పాలన అని వారు ప్రశ్నించారు.


ఇక్కడ నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని గొప్పలు చెప్పే పాలకులు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే నీళ్ళు భూమిలోకి ఇనికి సాగుకు పనికి రాకుండా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజలకు పశువులకు, మత్స్య కార్మికులకు ప్రాణాంతకంగా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. వాతావరణంలోనే ఎన్నటికీ నషించని విషపదార్థాలు వెలువడి పాడి పంటల దిగుబడి తగ్గి అన్నదాతలకు తీవ్ర స్థాయిలో నష్టపోతారని, ప్రజలకు పశువులకు క్యాన్సర్ సోకి మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వారు సూచించారు. గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమస్యలు తలెత్తి హుజురాబాద్ ప్రాంతమే కాకుండా, జననాలు ఆగి పోతాయని తల్లి పాలు, ఆవు పాలు విషమై కలుషితమై భవిష్యత్ తరాలు వారు వలస పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. హుజురాబాద్ ప్రాంతమే కాకుండా సమీప 4 జిల్లాల వరకు ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని తెలిపారు. అధికారులు, పాలకులు మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేపట్టే ఇట్టి డంపింగ్ యార్డ్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపి వేయాలని, జనావాసాలకు దూరంగా ఇట్టి డంపింగ్ యార్డు ప్రాజెక్టును తరలించాలని పోలాడి రామారావు, ఆవునూరి సమ్మయ్య, బండ శ్రీనివాస్ లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండ సింధూజ, గందే శ్రీనివాస్, వర్ధినేని రవీందర్ రావు, నాయకులు ఎడవల్లి కొండల్ రెడ్డి, వేల్పుల రత్నం, పోరెడ్డి శంతన్ రెడ్డి , ఈశ్వర్ రెడ్డి, సుధాకర్ రావు, పాత్రికేయులు విష్ణుదాస్ గోపాల్ రావు, సర్పంచ్ కట్కురి మాల్లారెడ్డి, తాళ్ళపల్లి శ్రీనివాస్, రమేష్, కొలిపాక సమ్మయ్య, తునికి సమ్మయ్య, ప్రభాకర్, రవీందర్, శ్రీధర్ గౌడ్, సారయ్యలతో పాటు పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, పాత్రికేయులు, ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున శిబిరంలో పాల్గొని ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డు పనులను తక్షణమే నిలిపి వేయాలని జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును తరలించాలని డిమాండ్ చేశారు.

మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..

మీడియాతో మాట్లాడుతున్న ఆరో వార్డు కౌన్సిలర్ బండ సింధుజ..






