
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని సిరిసపల్లి – గణేష్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేయ తల పెట్టిన డంపింగ్ యార్డ్ కు రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన బంద్ హుజురాబాద్ లో సక్సెస్ అయ్యింది. గత 12 రోజులుగా హుజురాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల, రైతుల ప్రయోజనం కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ బందుకు పిలుపునివ్వగా వర్తక వ్యాపార సంఘాలు, హోటల్లు ,టిఫిన్ సెంటర్లు, పెట్రోల్ పంపులు, నాయి బ్రాహ్మణ సంఘాలు, ఆటో కార్మికులు స్వచ్ఛందంగా బందుకు మద్దతు ఇచ్చాయి. అన్ని వర్గాల ప్రజలు బందుకు సహకరించడంతో హుజురాబాద్ పట్టణం అంతా బోసిపోయింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి బందును సంపూర్ణంగా జరిగే విధంగా ప్రయత్నించారు. హుజురాబాద్ బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇది ప్రజల కోసం రాజకీయాలకతీతంగా జరుగుతున్న బంధు అని వివరించారు. పట్టణంలో వందలాది బైకులపై ఎమ్మెల్యే ఇతర అనుచరులు కూర్చుని పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాల వద్ద నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్ ఇతర సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలతో కలిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల నుండి వచ్చే నిరసనను గుర్తించి డంపింగ్ యార్డ్ ఏర్పాట్ ను మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.



హుజురాబాద్ పట్టణంలో బంద్ కు సంబంధించిన దృశ్యాలు..







బైక్ పై తిరుగుతూ బంద్ ను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

చౌరస్తాలో ఆందోళన కారుల మానవహారం..

డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళన శిబిరం వద్ద ఎమ్మెల్యే మద్దతు..





