
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉధృతమైంది. ఈరోజు నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుని నిరాహార దీక్షలో కూర్చున్నారు.

ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ నిరసనకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు స్వచ్చందంగా ముందుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలు దీక్షా స్థలాన్ని నింపివేసి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ , జేఏసీ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజలపై అన్యాయం అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజల తరపున చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ఐక్యతతో ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.








