
—హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో ప్రజలు చేపట్టిన ఒక రోజు నిరాహారదీక్ష కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి సంఘీభావం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ప్రజలు చేపట్టిన డంపింగ్ యార్డు ఉద్యమం చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుందనీ, పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారనీ, హుజురాబాద్ ప్రజలు ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకెళితే డంపింగ్ యార్డు రద్దవుతుందనీ కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంలో 24 గంటల నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూనుకోగా ఆయన దీక్షా శిబిరాన్ని వినోద్ కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు…సిరసపల్లిలో డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే ఎన్జీటీ ని ఆశ్రయిస్తాం అని అన్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్..

డంపింగ్ యార్డు కోసం సర్కారు నయాపైసా పెడుతాలేదనీ, ప్రభుత్వం టెండర్లు వేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతుందన్నారు. ప్రభుత్వం గత ఏడాది టెండర్లు పిలిచి…ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలుస్తున్నారనీ గుర్తు చేశారు. రాంకి అనే సంస్థ హుజురాబాద్ ప్రాంతంలో వేస్ట్ టు ఎనర్జీ అనే కంపెనీ పెడతామని భూమి చూడటం జరిగిందన్నారు.
ఆర్డీఓను అడిగితే ప్రభుత్వ భూమి ఎంత ఉందని 120 ఎకరాల ప్రభుత్వ భూమి వివరాలు ప్రభుత్వం ఆడిగినట్లు చెప్పారన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో 60 వేల మంది ప్రజలు డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగ, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ కూడా ఈ రాంకి సంస్థ డంపింగ్ యార్డు నిర్వాహణ చూస్తోందనీ గుర్తు చేశారు.
డంపింగ్ యార్డు ద్వారా వాసన రాదు…అన్నీ మేమే చూసుకుంటామని మాయమాటలు చెపుతారనీ ప్రజలు నమ్మి మోసపోవద్దు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్-సికింద్రాబాద్ లెక్క వరంగల్-కరీంనగర్ ను జంటనగరాలను చేస్తామని చొప్పదండి సభలో ప్రజలకు మాయమాటలు చెప్పారనీ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గిసొంటి దిక్కుమాలిన మాటలేంటి అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జపాన్ లోని టోక్యో నగరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు పెట్టాలన్నారు.
బ్యాంకుల్లో అప్పుల కోసమే గిసొంటి చెత్త పనులు చేస్తున్నారన్నారు. హుజురాబాద్ ప్రాంతాన్ని మరో జవహర్ నగర్ లెక్క మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చి కట్టండి అని అన్నారు.
ప్రజలు ఒక రోజు నిరాహారదీక్షను విజయవంతంగా కొనసాగించండి అని, సిరసపెళ్ళిలో పెట్టదలుచుకున్న డంపింగ్ యార్డును రద్దు చేయాలనీ…ప్రభుత్వం పెట్టదలుచుకుంటే సర్కారు సొమ్ముతో పెట్టాలనీ వినోద్ కుమార్ సూచించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కూడా వేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.


కౌశిక్ రెడ్డి దీక్ష శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్న వినోద్ కుమార్..


కౌశిక్ రెడ్డి దీక్షకు సంఘీభావంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు






