
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఇప్పటి హుజురాబాద్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన ముద్దసాని దామోదర్ రెడ్డి పిన్న వయసులోనే 1985 నుంచి వరుసగా 4 సార్లు శాసన సభ్యుడిగా గెలుపొంది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్ లో యువజన సర్వీసులు, పర్యాటక శాఖ, గనులు, రవాణా శాఖా, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా పనిచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశాడన్నారు. దామోదర్ రెడ్డి ముఖ్యంగా రైతుల సామాన్యుల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. ఎస్ ఆర్ ఎస్ పి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందేలా దామోదర్ రెడ్డి పర్యవేక్షణ చేసేవారని అన్నారు. హుజురాబాద్ కమలాపూర్ నియోజక వర్గాలలోని ఆర్ అండ్ ఆర్ కింద ప్రతి గ్రామానికి పక్కా బీటీ రోడ్లు నిర్మించారని మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులు, ఓపెన్ వెల్ బావులు నిర్మించి ప్రతి గ్రామానికి మంచినీటి సమస్యలు లేకుండా కృషి చేశారని, స్కూల్ భవనాలు కమ్యూనిటీ భవనాలు సీసీ రోడ్లు నిర్మించారని చెరువుల పునరుద్దరణకు పూడిక తీత పనులు చేపట్టి చెక్ డాంలు నిర్మించి భూగర్భ జలాలు పైకి 4ఉండే విధంగా రైతులకు ఎంతో కృషి చేశారని, బలహీన వర్గాలకు ప్రభుత్వంతో స్థలం కొనిపించి పట్టాలు ఇప్పించి సామూహిక ఇండ్ల కాలనీలు నిర్మించారని గుర్తు చేశారు. గ్రామాల్లో పెత్తందార్లు పాలిట సింహ స్వప్నంలా ఉండి అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన సామాజిక న్యాయవాదిగా నిలిచారని యువతకు ఆశా జ్యోతిలా ఆదర్శంగా దామోదర్ రెడ్డి ఉండే వారని, నన్ను సైతం ప్రజా బాహుళ్యానికి దగ్గరగా ఉండే విధంగా ప్రోత్సహించి నాయకుడుగా నన్ను తీర్చి దిద్దిన గొప్ప వ్యక్తని ఆయన లేనీ లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పోలాడి రామారావు పేర్కొన్నారు.
బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్దసాని దామోదర్ రెడ్డి అభిమానులతో ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. 1956 జూలై 20న జన్మించిన దామోదర్ రెడ్డి 2012 ఏప్రిల్ 9న మృతి చెందగా గురువారం దామోదర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అలుగునూరుకు సమీపంలోని సదాశివ పల్లి తీగల వంతెన హైవే రోడ్డులో ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని మానకొండూర్ ఎంఎల్ ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో వారి కుటుంబ సభ్యులు ఆవిష్కరిస్తారని, దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎంఎల్ ఏ చింతకుంట విజయరామారావు, కరీంనగర్ ఎంఎల్ ఏ మాజీ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ శ్రీనివాస్ తదితర ముఖ్య అథీతులతో పాటు వేలాది మంది దామోదర్ రెడ్డి అభిమానులు హాజరు కానున్నట్లు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం వర్ధంతి సందర్భంగా దామోదర్ రెడ్డి అభిమానులు నిర్వహించే సంతాప సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోపు గోపాల్ రెడ్డి, రాచమడుగు నరసింగారావు, పుప్పాల రఘు, వెన్నమనేని విక్రమ సింహరావు, మూల పుల్లారెడ్డి, కలకుంట్ల సత్యనారాయణరావు, చందా గాంధీ, గోలి రాజేశ్వర్ రావు, పోల్నేని సత్యనారాయణరావు, గంగాటి తిరుపతిరెడ్డి, తణుకు ప్రభాకర్ లు పాల్గొన్నారు.





