
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కీ శేషు, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు అమోఘం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో టీడీపీ సృష్టికర్త ఎన్టీఆర్ చే అందగాడిగా కమలాపూర్ కుర్రోడిగా చంద్రబాబుచే డైనమిక్ లీడర్ గా పదే పదే గుర్తింపబడిన స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని గురువారం మానేరు బ్రిడ్జి చేరువలో తీగల వంతెన కూడలిలో మానకొండూర్ ఎంఎల్ ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి ఎంఎల్ ఏ ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావులు వేలాది మంది దామోదర్ రెడ్డి అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు హాజరు అయ్యారు. దామోదర్ రెడ్డి సోదరులు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తంరెడ్డిలు ఇతర కుటుంబ సభ్యులు, బందు మిత్రులు హాజయ్యారు. దామోదర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


పాల్గొన్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి దామోదర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం లక్మి నరసింహ గార్డెన్లో నిర్వహించిన దామోదర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కమలాపూర్ ఇప్పటి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన ముద్దసాని దామోదర్ రెడ్డి పిన్న వయసులోనే 1985 నుంచి వరుసగా 4 సార్లు శాసన సభ్యుడిగా గెలుపొంది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్ లో యువజన సర్వీసులు, పర్యాటక శాఖ, గనులు, రవాణా శాఖా, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా పనిచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన దామోదర్ రెడ్డి ముఖ్యంగా రైతుల, సామాన్యుల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. ఎస్ఆర్ ఎస్పి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందేలా దామోదర్ రెడ్డి పర్యవేక్షణ చేసే వారని గుర్తు చేశారు. హుజురాబాద్, కమలాపూర్, మానకొండూర్ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి పక్కా బీటీ రోడ్లు నిర్మించారని, మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు, ఓపెన్ వెల్ భావులు నిర్మించి ప్రతి గ్రామానికి చెందిన నీటి సమస్యలు లేకుండా కృషి చేశారని అన్నారు. స్కూల్ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించారని గుర్తు చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి చెక్ డ్యాములు నిర్మాణం, చెరువుల పూడిక తీత, చెరువుల పునరుద్దరణకు తీవ్రంగా కృషి చేసి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు.

మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు నిర్మాణం చేశారని, ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. బలహీన వర్గాలకు ప్రభుత్వంతో స్థలం కొనిపించి పట్టాలు ఇప్పించి సామూహిక ఇండ్ల కాలనీలు నిర్మించారని అన్నారు. గ్రామాల్లో పెత్తందార్లు పాలిట సింహ స్వప్నంలా ఉండి అట్టడుగు పేద వర్గాలకు అండగా నిలిచిన సామాజిక న్యాయవాదిగా నిలిచారని, యువతకు ఆశా జ్యోతిలా ఆదర్శంగా దామోదర్ రెడ్డి ఉండే వారని పేర్కొన్నారు. నన్ను సైతం ప్రజా బాహుళ్యానికి దగ్గరగా ఉండే విధంగా ప్రోత్సహించి నాయకుడుగా నన్ను తీర్చి దిద్దిన గొప్ప వ్యక్తిని, నన్ను సొంత సోదరుడిగా చూసే వారని ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆయన ఆశయాలు ఆదర్శంగా తీసుకొని ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని పోలాడి రామారావు భావోద్రేకం చెందారు. 1956జూలై 20న జన్మించిన దామోదర్ రెడ్డి 2012 ఏప్రిల్ 9న పిన్న వయసులోనే మరణించడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని నివాళులు అర్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హైదారాబాద్ ఉమ్మడి వరంగల్, అదిలాబాద్, నిజామాబాదు, మెదక్ జిల్లాల నుంచి కూడా తండోప తండాలుగా దామోదర్ రెడ్డి అభిమానులు దండులా కదలి రావడం విశేషం.







