
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు కీలక సమస్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సమగ్రంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
డంపింగ్ యార్డ్‌పై తీవ్ర అభ్యంతరం
హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డ్ కారణంగా హుజురాబాద్ మండలం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రాజెక్ట్ అమలైతే పంట పొలాలు, సాగునీరు, తాగునీటి వనరులు మరియు వాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతాయని, స్థానిక ప్రజల జీవన విధానం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. నూతన విత్తన ఉత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజురాబాద్ ప్రాంతాన్ని “వేస్ట్ టు ఎనర్జీ” పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయాలని సీఎస్‌ను కోరారు.
కల్వల ప్రాజెక్ట్‌పై నిర్లక్ష్యం..
మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో నిర్మించాల్సిన కల్వల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో డీపీఆర్‌లు సిద్ధం చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హుజురాబాద్ నియోజకవర్గంలో 6000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. రైతుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌ను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసంపూర్తిగా ఉన్న రహదారులు — ప్రజల ఇబ్బందులు
నియోజకవర్గంలోని పలు రహదారుల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం పూర్తికాకపోవడం, జమ్మికుంట ఇల్లంతకుంట హుజురాబాద్ మండలంలో ప్రధాన రహదారులు రాచపల్లి నుండి నాగంపేట,రాచపల్లి నుండి బూజునూర్,కనుకులాగిద్ద నుండి చెల్పూర్ రోడ్లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అర్ధాంతరంగా నిలిచిపోవడం అభివృద్ధి లోపాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పెండింగ్ బిల్లుల విడుదలపై విజ్ఞప్తి
నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కాంట్రాక్టర్లు మరియు పనులు చేపట్టిన సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే బిల్లులను విడుదల చేయాలని సీఎస్‌ను కోరారు.





