
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అన్ని రాజకీయ పక్షాల నాయకులు అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే డంపింగ్ యార్డ్ రద్దు అవుతుందని సామాజికవేత్త సబ్బని వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కూటమి చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా 20వ రోజు సబ్బని వెంకట్ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. అందుకు భిన్నంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ పరిశ్రమను అడ్డుకోవడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు బాధ్యులైన నాయకులు తమ పాత్రను సక్రమంగా పోషించడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వైఫల్యం వల్లనే హుజురాబాద్ కు డంపింగ్ యార్డ్ వచ్చి పడిందన్నారు. ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇన్చార్జి ప్రణవ్ బాబు గత ఎమ్మెల్యే, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వారందరూ కలిసికట్టుగా ఉద్యమం చేస్తే డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం రద్దు చేయని పరిస్థితి వస్తుందన్నారు. తనలాంటి మామూలు వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డితో డంపింగ్ యార్డ్ సమస్య చెప్పే అవకాశం లభించిందని ఇంత పెద్ద నాయకులు సీఎంను కలిసి ప్రజా వ్యతిరేక చర్యగా భావిస్తున్న డంపింగ్ యార్డ్ ను ఎందుకు రద్దు చేయించుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. బాధ్యులైన ప్రజా ప్రతినిధులు పట్టించుకోనంత వరకు ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆయన చెప్పారు. తన వంతు బాధ్యతగా డంపింగ్ యార్డ్ కోసం 24 గంటల దీక్ష చేస్తున్నానని ఆయన తెలిపారు. అనంతరం పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. 20 రోజులుగా ప్రజల ఆకాంక్షను తెలియడం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గుడిపాటి జైపాల్ రెడ్డి, ఎడ్ల విజయకుమార్, చందుపట్ల జనార్ధన్, టి వెంకట్రావు, కొలిపాక సమ్మయ్య, హనుమంతరావు, లక్ష్మణమూర్తి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

నిరాహార దీక్షలో మాట్లాడుతున్న సామాజికవేత్త సబ్బని వెంకట్..







