
_తెలంగాణ నుండి మంచి నటులు రావాలి
– నటుడు మురళీధర్ గౌడ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 26: ఇటీవల ప్రముఖ సినీ నటుడు మురళీధర్ గౌడ్ షూటింగ్ సందర్భంగా హుజురాబాద్ పట్టణానికి విచ్చేయడం జరిగింది. స్థానిక హుజురాబాద్ పరిసర ప్రాంతమైన మాణిక్యాపూర్ గ్రామంలో ఒక షూటింగ్ సందర్బంగా వచ్చిన మురళీధర్ గౌడ్ ని హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, కథా, నాటక రచయిత రావుల పుల్లాచారి తమ ఇంటికి స్నేహపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా హుజురాబాద్ కు చెందిన కవి, రచయిత, యుట్యూబర్, పారిశ్రామికవేత్త మంచికట్ల భాస్కర్ మురళీధర్ గౌడ్ ను ఆత్మీయంగా కలిసి బోకే ఇచ్చి, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. తెలంగాణా నుండి మంచి మంచి నటులు ఇంకా రావాలని, ప్రతిభ ఉండి కష్టపడే వారికి అనేక అవకాశాలు ఇదివరకు కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయని మురళీధర్ గౌడ్ చెప్పారు. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన మురళీధర్ గౌడ్ మంచి సక్సెస్ తో ముందుకు పోతున్నందుకు మంచికట్ల భాస్కర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన రచ్చబండ నాటకంలో మురళీధర్ గౌడ్ నటించారని, ఆ నాటకం హుజురాబాద్ లో కూడా ప్రదర్శించడం జరిగిందని ఆనాటి విషయాలు రావుల పుల్లాచారి గుర్తు చేస్తూ తన “వీలునామా “అనే కొత్త నాటక సంకలనం త్వరలో ఆవిష్కరణ చేయబోతున్నాని చెప్పారు. చాలా రోజుల తర్వాత హుజురాబాద్ కు రావడం ఆనందంగా ఉందని మురళీధర్ గౌడ్ తన సంతోషాన్ని వ్యక్త పరిచారు.

నటుడు మురళీధర్ గౌడ్ ను సత్కరిస్తున్న హుజురాబాద్ కు చెందిన ప్రముఖ కవి, కథా, నాటక రచయిత రావుల పుల్లాచారి, కవి, రచయిత, యుట్యూబర్, పారిశ్రామికవేత్త మంచికట్ల భాస్కర్





