
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని వాటిని కాపాడడానికి డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. గురువారం హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఆయన వారికి వినతి పత్రం అందజేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ప్రజలకు పర్యావరణానికి వ్యవసాయానికి కలిగే నష్టాలను వివరించారు. ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన వారికి వివరించారు. డంపింగ్ యార్డ్ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమని తెలిపారు.
గ్రామాలు, పట్టణాలకు సమీపంలో చెత్త నిల్వ చేయడం వల్ల దుర్వాసన, కాలుష్యం పెరగడం, భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల తాగునీటి సమస్యలు తలెత్తడం, దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నార. పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని, పరిసర ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోవడం, భూముల విలువ తగ్గడం లాంటివి జరుగుతాయని వివరించారు. హుజురాబాద్ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించి వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన తాను ఎప్పుడూ ముందుండి పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.

మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





