
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు దాన్యపు విక్రయించుకునే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా దాన్యం వస్తున్నా ఇంకా ఎందుకు కొనుగోళ్లు మొదలు పెట్టడం లేదని రైతులను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.

శుక్రవారం రైతు ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర, జిల్లాల నాయకుల తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంబించి 10 రోజులు దాతుతున్నా,కొనుగోళ్లు మాత్రం జరపడం లేదన్నారు. దీంతో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కనీసం వారికి టార్పాలీన్ షీట్ కవర్లు, గన్నీ బ్యాగులు సరఫరా చేయడం లేదని దీంతో ప్రైవేట్ దళారులకు రైతులు తక్కువ ధరకు దాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఇందుకు ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ వ్యక్తుల మధ్య కుదిరిన బేర సారాల లోపాయికారీ ఒప్పందమేనని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల కొద్ది మొత్తం కొనుగోళ్లలో క్వింటాల్ కు తాలు, మట్టి లేని, ఆరబెట్టి ఎండిన సూకా దాన్యానికి తూకం సమయంలో ఐదు కిలోల దాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న ఓసి జెఏసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

హమాళీలు లేరని మిల్లుల వారు తీసుకోవడం లేదని సాకులు చెబుతూ ఇప్పటికే 60 శాతం దాన్యం ప్రైవేట్ వ్యక్తుల పాలు చేశారన్నారు.సన్న రకాలకు ఇస్తున్న 500 రూపాయల బోనస్ ఎగొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని రామారావు విమర్శించారు. కావాలనే ప్రైవేట్ వాళ్లకు
లబ్ది చేసేందుకే ఆలస్యంగా దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యపు కొనుగోళ్లు జరపడం లేదన్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగొట్టిన ప్రభుత్వం, సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు పంటల కోత సమయంలో అర కొరగా విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమన్నారు .సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ను వెంటనే దాన్యపు డబ్బులతో పాటే ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇఛ్చిన మాట ప్రకారం ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో తక్షణమే దాన్యపు కొనుగోళ్లను జరపాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
పొద్దు తిరుగుడు, శనగ, మొక్క జొన్న రైతులు కూడా పడి కాపులు కాస్తున్నారని వారి దాన్యాన్ని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో క్కనుగోళ్లు జరపాలని లేకుంటే రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం చేస్తామని పోలాడి పేర్కొన్నారు. రైతుల పంటలు, వరి కోతలు పూర్తి కాక పోవడం తో రైతులుకు రావడం ఇబ్బంది అవుతుందని భావించి వివిధ వర్గాలు విద్యార్థుల విన్నపం మేరకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో రైతుల మహాగర్జన సమర భేరి సభను మే 30వ తేదీకి మార్చినట్లు పోలాడి రామారావు తెలిపారు. మే 30 న రెండు లక్షల మందితో రైతుల మహాగర్జన సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు జున్నుతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, విక్రమ సింహారావు, నగునూరి రాజేందర్, తీగల లక్ష్మణ్ రావు, కోడూరు సత్యనారాయణ, బోయినపల్లి శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర్ రావు, దాట్ల మెహన్, కొత్తకొండ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.





