
–అన్నదాతలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అన్నధాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఈనెల 30న కరీంనగర్ వేదికగా భారీ ఎత్తున నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభకు మద్దతు కోరుతూ కరీంనగర్ పట్టణంలో నాయకులతో కలిసి పోలాడి రామారావు ఎంఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎంఎల్ ఏ గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎంఎల్ ఏ సుంకే రవిశంకర్, మాజీ ఎంఎల్ సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా హరి శంకర్, ఏనుగు రవీందర్ రెడ్డిలను రైతు మహాగర్జనకు సభకు ఆహ్వానిస్తూ పోలాడి రామారావు నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయగా అందుకు వారు సానికూలంగా స్పందించి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి రామారావుతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు.

అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500బోనస్ చెల్లింపులో అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో మిల్లర్లు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు ఆరు కిలోల నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ దాన్యాన్ని కామన్ గ్రేడ్ క్రింద జమ కడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు దాన్యాన్ని ఎండ బెట్టే క్రమంలో తీవ్రమైన ఎండలతో రైతులు మృత్యువాత పడటం కలచివేసిందన్నారు. పెట్టుబడి సాయం క్రింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పోలాడి రామారావు ద్వజమెత్తారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ రైతుల ఖాతాలో పూర్తిగా నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాలలో లారీలు, హమాళీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని పంటలకు బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకతీతంగా రైతాంగ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 30న కరీంనగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది తో నిర్వహించతలపెట్టిన రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతుగా మహాగర్జన సమర భేరి సభకు పెద్ద ఎత్తున రైతులతో కలిసి తరలి వస్తామని ఆయా పార్టీల నాయకులు ప్రకటించడం పట్ల ప్రజా సంఘాల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బండ సంపత్ రెడ్డి, చింతల రమణారెడ్డి, పోల్సాని రామారావు, పంజాల శ్రీనివాస్, మహిపాల్, రాజేందర్ రావు, శ్రీపతిరావు, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొండాల్ రెడ్డి, రాజయ్య, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





