
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(సిద్దిపేట) : రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, ఇచ్చిన హామీల మేరకు అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకు కరీంనగర్ లో ఈనెల 30న రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభను పార్టీల కతీతంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
ఆదివారం సిద్దిపేటలో రైతు ప్రజా సంఘాల జిల్లా,రాష్ట్ర నాయకుల తో కలిసి ఈనెల 30న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహా గర్జన సమర భేరి సభ ఏర్పాట్లపై రామారావు సన్నాహక సమావేశం నిర్వహించి రవాణా, రైతుల సమీకరణ ఏర్పాట్లపై కో ఆర్డినేటర్ లతో సమీక్షించారు. సమరభేరి సభ ఆహ్వాన ప్రతులను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని,నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.లేకుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

రెండు లక్షల ఋణ మాఫీలో సగం మందికే మాఫీ చేసిన ప్రభుత్వం అర్హులైన మిగతా రైతులకు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదని రామారావు ప్రశ్నించారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని ఎందుకు కొంతమేరకు సన్న రకాలకు అడపా దడపా ఇస్తున్నారు ?ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ?అని పోలాడి ప్రశ్నించారు. పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిండుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ద్వజమెత్తారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్, యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా రైతుల అకౌంట్లలో నేటికీ పూర్తిగా జమ చేయలేదని, పంటల సాగు సమయంలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ. 4రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. దాన్యపు కొనుగోలు కేంద్రాలలో అధికారుల పర్యవేక్షణ లేక పోవడం తో మిల్లర్లు కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు ఆరు నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువుగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని యువతకు ఉద్యోగావకాశాలు ఎప్పుడు కల్పిస్తారు అని రామారావు ప్రశ్నించారు.
50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రైతుల భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలనే తదితర డిమాండ్లతో రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇఛ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ డిమాండ్ల సాధనకు
ఈ నెల 30 న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కదలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లా రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకులు వన్యాల భూపతి రెడ్డి, అయిత నాగరాజు, వేణు గోపాల్ రెడ్డి, హంసకేతన రెడ్డి, అశోక్, దేవేందర్ రావు, రాజునాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు తదితరులతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.





