
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే రద్దు చేస్తూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో సీడీఎంఏ శ్రీదేవిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంత ప్రజలు, జేఏసీ నాయకులు, వివిధ ప్రజాసంఘాలు కలిసి డంప్ యార్డ్ రద్దు కోసం గత కొంతకాలంగా ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా డంప్ యార్డ్ ఏర్పాటుకు ప్రయత్నించడం పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు.
డంప్ యార్డ్ కారణంగా పరిసర గ్రామాల్లో గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, చెత్త నుంచి వెలువడే విషపూరిత వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులు, అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములు పాడైపోవడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై రైతులు తీవ్ర నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
హుజురాబాద్ ప్రజల ఆవేదనను, జేఏసీ నాయకుల విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల తరఫున ఎన్నోసార్లు ప్రభుత్వ పెద్దలకు, అధికార యంత్రాంగానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన జీవో లేదా అధికారిక ప్రకటన విడుదల కాకపోవడం వెనుక కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు.
ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వెంటనే డంప్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగని ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీడీఎంఏ శ్రీదేవిని కోరారు.
అంతేకాకుండా, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయకపోతే హుజురాబాద్ ప్రజలతో కలిసి మరింత ఉద్ధృతమైన ఉద్యమానికి సిద్ధమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.





