
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కొయ్య కాళ్లు అంటుపెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గ్రామ శివారులోని మూడు చింతల వెనుక వైపు గుర్తుతెలియని రైతులు కొయ్య కాళ్లు అంటూ పెట్టడంతో సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరం వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చేలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా సరైన రహదారి లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లకుండా అక్కడే ఉండి గస్తీ కాస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతుల కరెంటు మోటార్లు సర్వీస్ వైర్లు దగ్ధమైనట్లు పలువురు గుర్తించారు. ఫైర్ ఇంజన్ తో కొంత దూరం మంటలు అర్పినప్పటికీ పూర్తిస్థాయిలో ఆర్పేందుకు ఇంజన్ మంటల వరకు వెళ్లలేక పోతుంది. గ్రామస్తులు తక్షణమే స్పందించి మంటలు ఆర్పేందుకు సహకరించకపోతే పెద్ద ఎత్తున వ్యాపించి ఇప్పల నర్సింగాపూర్ గ్రామ సమీపంలోని ఇండ్లకు, కాట్రపల్లి శివారులోని ఇండ్లకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఏది ఏమైనాప్పటికీ కొయ్య కాళ్లు తగలబెట్టి రైతులు పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలకు కారణం కావడం బాధాకరం.. అధికారులు, ప్రభుత్వం కొయ్య కాళ్లు తగలబెట్టే విషయంలో రైతులను చైతన్య పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.



ఇప్పల నర్సింగాపూర్ శివారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు..



మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజన్ సమీపము వరకు వెళ్లలేకపోయిన దృశ్యం..





