
కృతజ్ఞత కార్యక్రమమా?…. విజయోత్సవ సభనా?
బండి సంజయ్ ‘గెట్ టు గెదర్’కు వేలాదిగా తరలివచ్చిన జనం
ప్రభం‘‘జనం’’తో కిలోమీటర్ల తరబడి స్తంభించిన బొమ్మకల్ బైపాస్
అతిథులుగా విచ్చేసిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నల్గొండ ఎంపీ అభ్యర్థులు
నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ధన్ పాల్, పాయల శంకర్ సైతం రాక
కష్టపడ్డ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్
బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపు ఖాయమన్న సంజయ్
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి: బి జేబ్పి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం ‘‘వి’’ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ‘గెట్ టు గెదర్’ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఊహించని తాకిడితో వీ కన్వెన్షన్ మొత్తం జనంతో నిండిపోవడమే కాకుండా… రోడ్డు బయట, బొమ్మకల్ బైపాస్ పైనా జనం బారులు తీరారు. దీంతో బొమ్మకల్ బైపాస్ రోడ్డు మొత్తం కిలోమీటర్ల తరబడి స్తంభించిపోయింది. మరోవైపు ఈ గెట్ టు గెదర్ కార్యక్రమానికి వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, పెద్దపల్లి నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఆరూరి రమేశ్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్ తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, జెనవాడ సంగప్ప తదితరులు హాజరయ్యారు.
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను చూసి అతిథులుగా వచ్చిన నేతలతోపాటు నాయకులంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ‘గెట్ టు గెదర్’ పేరుతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమమా? విజయోత్సవ సభనా? అని విస్తుపోయారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను చూసిన నేతలంతా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జూన్ 4న వెలువడే ఫలితాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల దిమ్మ తిరగడం ఖాయమన్నారు. కేసీఆర్ కు ఈ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయన్నారు. దేశమంతా నరేంద్రమోదీ హవా కొనసాగుతోందని, తెలంగాణ అంతటా బీజేపీకి అత్యధిక ఫలితాలు రాబోతున్నాయన్నారు.
ఆరూరి రమేశ్, సీతారాంనాయక్, సైదిరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ అంతటా అద్బుత ఫలితాలు వస్తున్నాయనడానికి ఇక్కడికి వచ్చిన ప్రజలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
