
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని సైదాపూర్ రోడ్ లో గల ఎస్సారెస్పీ కెనాల్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు శ్రమదానంతో ముళ్ళ పొదలను తొలగించారు. గత కొన్నాళ్లుగా కెనాల్ వాకర్స్ కు వాకింగ్ చేసేందుకు ముళ్ళ చెట్లు ఇతర చెట్ల కొమ్మలు, గుంతలు పడి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని సంబంధిత మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి వాకర్స్ నాయకులు పలుమార్లు తెలిపినప్పటికీ పట్టించుకోకపోవడంతో వారే స్వయంగా శ్రమధానంతో ముళ్లపోదలను ఇతర చెట్ల కొమ్మలను తొలగించి బురద ఉన్నచోట మొరంతో నింపారు. కెనాల్ వాకర్స్ సుమారు వందమంది నిత్యం వాకింగ్ చేస్తుంటారు. అలాగే మున్సిపల్ నల్లాల బావి సైతం అక్కడే ఉండడంతో టాంకర్లతో నీటిని నింపుకొని పట్టణానికి సరఫరా చేస్తుంటారు. తమకు ఎదురయ్యే ఇబ్బందులపై మున్సిపల్ సిబ్బంది దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లిన కుంటి సాకులు చెబుతూ ముళ్లపొదలను తొలగించకపోవడంతో వాకర్స్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అటుగా వెళ్లే రైతులు, ఇప్పల నర్సింగాపూర్, కాట్రపల్లికి కెనాల్ మీదుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా శ్రమదానంతో రోడ్డును బాగు చేశారు. అయినప్పటికీ పెద్దపెద్ద ముళ్ళ చెట్లు అక్కడక్కడ ఈదురు గాలులకు రోడ్డుపైకి వచ్చి ఇంకా ఇబ్బంది కలిగిస్తున్నాయని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో జెసిబితో ముళ్ళ చెట్లను తొలగించి వాకర్స్ కు వాకింగ్ చేసేలా సౌకర్యాలు కల్పించాలని వాకర్స్ నాయకులు మండల యాదగిరి, రవీందర్ రెడ్డి, రవీందర్రావు, బుచ్చి రాజం, మహేంద్ర చారి, పెద్దన్న చారి, సోము, కనుకయ్య, రాజు, ఇస్మాయిల్, మొగిలి, శ్రీకాంత్, శ్రీధర్ చారి, విజేందర్ తదితరులు విజ్ఞప్తి చేశారు.




శ్రమధానంతో ముళ్ళ పొదలను తొలగిస్తున్న వాకర్స్ నాయకులు, సభ్యులు..





