
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రైతాంగాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ విజయ్ కుమార్ కు బిజెపి నేతలు వినతి పత్రం అందజేశారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తోడు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి హుజురాబాద్ ప్రాంతంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. బీజేపీ జిల్లా నాయకత్వం పిలుపు మేరకు రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి, రెండు రోజులుగా వడ్ల కల్లాల సందర్శనకు వెళ్లామన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశామని, వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని కొన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నారన్నారు. దీనికితోడు అకాల వర్షాల నుంచి కాపాడేందుకు సరిపడ టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో పదే పదే తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి అరబెట్టేందుకు రైతులు తిండితిప్పలు మాని అష్ట కష్టాడు పడుతున్నారని వారు ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాలవద్ద వడ్లు తడవకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయ మన్నారు. అయినా ఇబ్బందులను అధిగమిస్తూ అన్నదాతలు వడ్లను ఆరబెట్టినప్పటికీ సకాలంలో వాటిని కొని, వారికి విముక్తి కలిగించే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న దాఖలలే లేకపోవడం విచారకరం అన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామి ప్రకారం కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా క్వింటాలుకు రూ.200 నుండి రూ.500 ల వరకు రైతులు నష్టపోతున్నారన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే, సీఎం ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిసిపోయిందన్నారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పేపర్ పై రాసిచ్చిన హామీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ గెలిచాక, కల్లాలకు రెండో పంట వచ్చినా, క్వింటాలుకు రూ.500ల బోనస్ హామీకి దిక్కు లేదన్నారు. బోనస్ ఇవ్వకపోగా సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం, దొడ్డు రకం వడ్లనే పండించిన అత్యధిక శాతం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దీనిపై రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మా ప్రాంతంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ సగానికిపైగా పూర్తయినట్లు మా దృష్టికి వచ్చింది. కొనుగోలు చేసిన వడ్లకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారను, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వడ్లు కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని కోరారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసి కనీస మద్దతు ధర చెల్లించాలని, తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు వడ్ల కోనుగోలు చేయాలని బీజేపీ శాఖ పక్షాన విజ్ఝప్తి చేశారు.
మరో ముఖ్యమైన అంశమేమిటంటే యాసంగిలో అకాల వర్షాలకు మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన విషయం మీకు తెలిసిందే. మా క్షేత్రస్థాయి పర్యటనలో రైతులతో మాట్లాడుతున్నప్పుడు వరి, మొక్కజొన్న, మామిడి పంట నష్టం జరిగినట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణమే రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ పరిహారం అందనేలేదు అన్నారు. ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టారని, కౌలు రైతులపై అదనంగా మరో రూ.10 వేల భారం పడిందన్నారు. వీరందరికీ కనీసం పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయడం లేదని, ప్రభుత్వ సాయం అందక, చేసిన అప్పులు తీరక జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. వారి దుస్థితిని సహృదయంతో అర్థం చేసుకుని యుద్ద ప్రాతిపదికన నష్ట పరిహారం అందించాలని బీజేపీ పక్షాన కోరారు.
అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలైనా రైతు భరోసా కింద రైతుకు సాయం అందలేదు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. పండించిన పంటకు డబ్బులు రాక, ప్రభుత్వం నుండి సాయం అందక, చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోంది. వ్యవసాయానికి పెట్టుబడి లేక, బ్యాంకుల నుండి కొత్త అప్పులు పుట్టక రైతులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో రైతన్నకు అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ పక్షాన కోరుతున్నాం. లేనిపక్షంలో రైతులకు అండగా నిలబడి, వారి పక్షాన పెద్ద ఎత్తున నిరసనా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా శాఖ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, జిల్లా అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శులు కొండాల్ రెడ్డి, వోడ్నాల విజయ్ , తూర్పాటి రాజు సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, మండల ఉపాద్యక్షులు రవిందర్, శ్రీనివాస్, కార్యదర్శి పంజాల లక్ష్మీ , యువ మోర్చా అద్యక్షులు చైతన్యరెడ్డి , దేవా గౌడ, నల్ల సుమన్, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ళ సంజీవరెడ్డి, తిప్పబత్తిని రాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బోరగల సారయ్య, ఓబీసీ మోర్ఛ అధ్యక్షులు గంట సంపత్, బూత్ అద్యక్షులు ఆవుల సదయ్య, మధిర రమేష్, చత్తర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.