ఆవునూరి సమ్మయ్య,
హుజురాబాద్ జెఏసి కన్వీనర్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రముఖ తెలంగాణ గాయకులు నేర్నాల కిషోర్ రాసి,పాడిన”దఛ్చన్న దారిలో పాటను విన్నాను.
బాగుంది.
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోని అమరులను స్మరిస్తూ పాడిన పాటను అమరులకు అంకితమివ్వడం అభినందించదగ్గ విషయం.
2 జూన్ 2024 రోజుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు…ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది.
మలిదశ తెలంగాణ ఉధ్యమంలో బలిదానాలు చేసుకున్న యువతీ, యువకుల అమరత్వం పునాదులపై, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు చేసిన త్యాగాలకు గుర్తుగా “ప్రత్యేక రాష్ట్రంగా”తెలంగాణ ఆవిర్భవించింది.
నేర్నాల కిషోర్ మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభానికి ముందు నుండే గాయకునిగా గుర్తింపు కలిగినవున్నాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తం తన పాట,మాటలతో గళాన్ని విన్పించి,ప్రజలల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించాడు.
ప్రజాయుద్ధనౌక గద్దర్ అనేక సభల్లో”ఎట్లున్నవే నాపల్లే” అనే పాటను నేర్నాల కిషోర్ చేత పాడించి కిషోర్ తో పాటు గద్దర్ కూడా ఆ పాటపై నృత్యం చేసిన సందర్భాలను చూసాను.
“ఎట్లున్నవే నా పల్లే” పాటను తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ నేర్నాల రాసి, పాడిండు. ఈ పాట యావత్
తెలంగాణ సమాజానికి వాళ్ళ బాల్యాన్ని గుర్తుచేస్తుంది.ఆ రోజుల్లో లక్షలాది మంది ఈ పాట విని స్పందించారు.
తెలంగాణ ఉద్యమంతో పాటు,అనేక సామాజిక అంశాలపై నేర్నాల కిషోర్ పాటలు రాసిండు, రాస్తుండు,పాడిండు,పాడుతుండు.
“ఎట్లున్నవే నా పల్లే”పేరుతో ఒక పాటల సంకలనాన్ని కూడా ప్రచురించిండు.
1969 తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 400 మందికి పైగా అమరులయిండ్లు.
ఆ తర్వాత భూస్వామ్య వ్యవస్థ ఆధిపత్య,అణచివేత,వివక్ష ధోరణులను ధిక్కరిస్తూ సాయుధ పోరాటాన్ని కొనసాగించిన వేలాది మంది నక్సలైట్ యివతీ,యువకులు అమరులయిండ్లు.ఇప్పటికి ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది.
ఆధిపత్య ధోరణులను తెలంగాణ మట్టి మనుషుల్లో ధిక్కరించే స్వభావం నిజాం రాచరిక వ్యవస్థకు,అందులో భాగంగా కొనసాగిన భూస్వామ్య వ్యవస్థ కు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలోనే పురుడు పోసుకుని ఇప్పటికి ముందుకు సాగుతుంది… అది తెలంగాణ సమాజం సమానత్వాన్ని సాధించేవరకు కొనసాగుతూనే వుంటుంది…
ఆ పోరాటాల కొనసాగింపులో భాగంగానే నేర్నాల కిషోర్ అమరులను స్మరిస్తూ,రాసి, పాడిన పాట “దఛ్చన్న దారిలో…పాట”
దాదాపు 200 కళాకారులు పాల్గొన్న ఈ పాట చిత్రీకరణ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు సమీపంలోని కొత్తగట్టు, మొలంగూరు గుట్టల(కొండల) వద్ద జరిగింది.
నేర్నాల కిషోర్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకున్న పాటను మంగళవారం(28-5-2024) నాడు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో అమరుల కుటుంబ సభ్యుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రో.హరగోపాల్,ప్రో.కోదండరాం,అరుణోదయ గాయని విమలక్క,సినిమా డైరెక్టర్ ఎన్.శంకర్, ప్రజావాగ్గేయకారులు గద్దర్ సహచరి గుమ్మడి విమల ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు,కళాకారులు పాల్గొని నేర్నాల కిషోర్ ను అభినందించారు.
నేను ఈ పాటను విన్నాను.
బాగుంది…మీరు కూడా వినాలని…
అమరులను స్మరించుకునే అవకాశాన్ని కల్పించిన నేర్నాల కిషోర్ కు శుభాభినందనలు…
ప్రజాకళలు వర్ధిల్లాలి
ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి
ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి.