
-నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధి రఘు
స్వర్ణోదయం ప్రతినిధి, ఎల్కతుర్తి:
పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నియంత్రణ కొరకు లింగాకర్షణ బుట్టలు వాడాలని నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధి వంగ రఘు అన్నారు. శుక్రవారం ఎల్కతుర్తి మండలంలోని పెంచికలపేట గ్రామంలో రైతులకు కార్గిల్ సంస్థ, సేఫర్డ్ సంస్థ సహకారంతో లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వంగ రఘు మాట్లాడుతూ పత్తి పండించే రైతులందరూ మంచి పత్తిని పండించాలంటే పురుగుల నియంత్రణ చాలా అవసరమని, అందులో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా నష్టం చేస్తున్నదన్నారు. దీనివల్ల పత్తి దిగుబడి తగ్గడం, పత్తి నాణ్యత తగ్గడంతో మార్కెట్లో మంచి రేటు రాకపోవడం వలన రైతులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. గులాబీ రంగు పురుగు నియంత్రణ కొరకు లింగాకర్షణ బుట్టలను గ్రామంలో పత్తి పండించే రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలా గ్రామంలోని రైతులందరూ పత్తి పెట్టిన 45 రోజులకు వీటిని పెట్టడం వలన మగ రెక్కల పురుగులను నియంత్రణ జరుగుతుందని, మంచి పత్తిని పండించాలంటే రైతులందరూ ఎండాకాలం దుక్కులు చేసుకోవాలన్నారు. భూమిలో దాగి ఉన్న ప్యూపదశ పురుగులను నియంత్రించవచ్చన్నారు. విధిగా లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం వల్ల పురుగుల ఉదృతిని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవపూర్ రైతు ఉత్పత్తిదారుల ప్రతినిధులు మౌనిక, రాజేందర్, లతతో పాటు సుమారు 120 మంది గ్రామ పత్తి రైతులు పాల్గొన్నారు.
