
–బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ అండదండలు
–బాధిత కుటుంబానికి రైస్ మిల్ ద్వారా ఐదున్నర లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో రెండున్నర లక్షల నష్ట పరిహారం
–చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్ లో ఉద్యోగం కల్పన
సుల్తానాబాద్ కాట్నపల్లి గ్రామ సంఘటన బాధితురాలి కుటుంబానికి పరామర్శ
స్వర్ణ ఉదయం ప్రతినిధి, పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో జరిగిన సంఘటన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమత ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల 6 ఏళ్ళ పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుదిళ్ళ శ్రీధర్ బాబు, దనసరి అనసూయ సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణారావులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుల్తానాబాద్ లో మీడియా ప్రతినిధులతో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పని చేసే బీహర్ కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎంపీ, సహచర ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని, భవిష్యత్తులో పోలీసు కార్యక్రమాలు పటిష్టం చేస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం రైస్ మిల్ లో పనిచేస్తున్న దంపతుల 6 సంవత్సరాల బాలికను బీహర్ కు చెందిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని అన్నారు. బాలిక అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే నిమిషాలలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తనీఖీలు చేసి సంఘటన స్థలంలో విచారించి నిందితుడిని పట్టుకున్నారని, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని అన్నారు. మానవ ప్రపంచం క్షమించరాని నేరాన్ని నిందితుడు చేశాడని, పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేందుకు మంత్రి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రావడం జరిగిందని, ఆ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించామని అన్నారు. చిన్నారి బాలికను ఆ కిరాతకుడు దారుణంగా హత్య చేయడమనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరిత గతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. పోలీసులకు సమాచారం అంది బాలిక ఆచూకీ తెలుసుకునే లోపే నిందితుడు ఆ బాలికను హత్య చేయడం, ఒక గంట వ్యవధిలో ఇది జరగడం దురదృష్టకరమని నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగు విధమైన జాగ్రత్త చర్యలు పోలీస్ కమీషనర్ చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఇంటిలో పనిచేసే డొమెస్టిక్ హెల్పర్, ప్రతి పరిశ్రమలో పనిచేసే వర్కర్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతే వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందని, ఇది ప్రత్యేకంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసు శాఖ ఉక్కు పాదం మోపుతుందని మంత్రి తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేరని, ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ తో చర్చించి ఉద్యోగం కల్పించనున్నట్లు, వారికి సొంత ఇంటి మంజూరు, ఆ తల్లిదండ్రుల వద్ద ఉన్న మరో పాప చదువు బాధ్యతలను సైతం ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, సుల్తానాబాద్ లో జరిగిన చిన్నారి సంఘటన పట్ల యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైందని, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబానికి సంబంధిత రైస్ మిల్ నుంచి ఐదున్నర లక్షల రూపాయల పరిహారం, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిని కలిసి చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున మరో రెండున్నర లక్షల పరిహారం అందించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 200 పైగా రైస్ మిల్లులు ఉంటాయని, చాలా కాలంగా సీజన్ సమయంలో ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి కార్మికులు ధాన్యం కొనుగోలు సమయాల్లో వచ్చి పని చేస్తారని, ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని, దీని పట్ల చాలా బాధపడుతున్నా మని అన్నారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట డిసిపి ఎం.చేతన, ఏసిపిలు గజ్జి క్రిష్ణ, రమేష్, సిఐ క్రిష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


