-జూన్ 17న జమ్మికుంటలో సన్నాహక సమావేశం
-ముఖ్యఅతిథిగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
-వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రముఖ కళాకారులు, కవులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట: మాదిగల చైతన్యం కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసం 1994లో ఆవిర్భవించిన దండోరా (ఎమ్మార్పీఎస్) ఆవిర్భవించి 30 ఏళ్లు కావస్తున్న సందర్భంగా జూలై 7న వరంగల్ లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వచ్చేనెల 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశం జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశం జరిగేది పార్టీలకు అతీతంగా అని, మాదిగల ఆత్మగౌరవం కోసం.. మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ఆవిర్భావ వేడుకలకు సమాయత్తం కావాలని అన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా విడుదల చేస్తున్న పాటలకు, పుస్తకాల ముద్రణకు తనవంతుగా సహకారం అందిస్తానని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ అంశంలో మందకృష్ణన్న చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. పార్టీలకతీతంగా మాదిగలు, మాదిగ ఉప కులాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం సీనియర్ నాయకుడు నలిగంటి శరత్ మాట్లాడుతూ మాదిగ జాతికి మనందరం వారసులం కనుక ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆహ్వానం పలికారు. కవిత్వం, పాటలు, వ్యాసాలు సమీకరించి పుస్తక రూపంలో అందించబోతున్నామని అన్నారు. రచయితలు తమ రచనలు ఈనెల 25 లోగా పంపించాలని కోరారు. సీనియర్ కళాకారుడు రామంచ భరత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ కవులు, కళాకారులు ముక్కెర సంపత్ కుమార్, డా. కట్కూరి మహేందర్, అశోక్ మోరే, గిద్దె రాంనర్సయ్య, అంబాల మధునయ్య, గోల్కొండ బుచ్చన్న, పుల్లూరు సమ్మయ్య (సమర్), జూపాక శివ, కన్నూరి ఆనంద్, కేతపాక ప్రసాద్, సీనియర్ దళిత సంఘాల నాయకుడు ఇమ్మడి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.