
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు సమస్యలపై సమీక్షించ లేదు, ఇన్చార్జి మంత్రిగా ఉత్తంకుమార్ రెడ్డి విప్లమయ్యారని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆరోపించారు. శనివారం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత నాటి సియం కెసిఆర్… నాటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్… ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లదే అని అన్నారు. ఇందులో ఇంకొకరి భాగస్వామ్యం లేదని చెప్పారు. తోటి కార్పోరేటర్ బండి సంజయ్… కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నామాన్నారు.శుభాకాంక్షలు తెలపడంలో రాజకీయ కోణం లేదని, కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల 15 రోజులు గడిచిపోయిందని, జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి సమస్యలపై ఒక్క సారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదనీ ఆరోపించారు. ఇదేమని అడిగితే ఎలెక్షన్ కోడ్ సాకు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని... దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారనీ, అర్హులైన వారిలో 40 శాతం మందికి గృహ జ్యోతి, 5 వందలకు సిలిండర్ పథకాలను అమలు చేయడం లేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల పథకం ఏమైందని ప్రశ్నించారు.? వర్షాకాలం ప్రారంభమైందని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు. గత వర్షాకాలంలో తెగిపోయిన కుంటలు, చెరువుల మరమ్మతుల పై ఇప్పటికైనా సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపారని హరి శంకర్ ఆరోపించారు.
ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై 2 నెలలకు ఒకసారి సమీక్షించాలన్నారు. పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ కు చోటు కల్పించిందని, హైదరాబాద్ కాదని నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాటి సీఎం కేసీఆర్ సూచన మేరకు నాటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు ఢిల్లీకి వెళ్లి కరీంనగర్ కు అర్హత లేకున్నా స్మార్ట్ సిటీ హోదాను తీసుకువచ్చారని తెలిపారు. స్మార్ట్ సిటీ కోసం 18 వందల కోట్లతో డిపిఆర్ పంపిస్తే కేవలం 1000 కోట్ల నిధులను మంజూరు చేశారని, మంజూరైన నిధులను తీసుకువచ్చేందుకు నాటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నో లెటర్లు రాశారన్నారు. నిధులు తేవడం నాటి ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ వంతైతే, సివిల్ ఇంజనీర్ గా కరీంనగర్ అభివృద్ధిని గంగుల కమలాకర్ చేశారన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో నాటి సీఎం కేసీఆర్, నాటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ల పాత్ర కీలకం అన్నారు. ఇందులో ఈ ముగ్గురికి తప్ప వేరే వారి భాగస్వామ్యం లేదని చెప్పారు.
మంజూరైన 1000 కోట్లలో ఇప్పటివరకు 750 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని మిగతా 250 కోట్లు నిలువ ఉన్నాయనీ గుర్తు చేశారు. ఈ నిధులకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందనీ, తోటి కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండడం పట్ల గర్విస్తున్నామాన్నారు.
బండి సంజయ్ ప్రధాని దగ్గరి మనిషిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీగా మొదటి టర్మ్ లో బండి సంజయ్ మున్సిపల్ విషయంలో ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదని, ఈ నిధులకు ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ తేవడంతో పాటు కరీంనగర్ మున్సిపల్ పంపించిన 18 వందల కోట్లలో మిగతా ఎనిమిది వందల కోట్లను మంజూరు చేయించాలని బండి సంజయ్‌ని కోరారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట రామాలయాల అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్ టు హసన్ పర్తి రైల్వే లైన్ తీసుకురావాలన్నారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీని తీసుకురావాలని, నీ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈఏస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నారు. సిరిసిల్ల, జగిత్యాల ,హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 18 లక్షల మంది ఓటర్లకు గాను… ఒక్క శాతం ఓటర్లు అంటే… 18,000 మందికి ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను తీసుకురావాలని, నత్త నడకన కొనసాగుతున్న తీగల గుట్టపల్లి ఆర్ఓబి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం సులువుగా చేసేందుకు కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలును నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవన్నీ పూర్తి చేస్తే బండి సంజయ్ కరీంనగర్ చరిత్రలో నిలిచిపోతారని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయిందని, ఇప్పటికైనా కాంగ్రెస్, బిజెపిలో గత ప్రభుత్వం అని అనడం మానుకోవాలని, మీరు చేయాల్సింది చేయండి అని సూచించారు. 29 మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు గంగుల కమలాకర్ వెంటే ఉన్నారని, తోటి కార్పోరేటర్ గా ఉన్న బండి సంజయ్ ఉన్నత పదవి చేపట్టాడని శుభాకాంక్షలు తెలిపానే తప్ప ఇందులో రాజకీయ కోణం లేదు అని చెప్పారు.
ఈ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్ వర్మ, యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, మైనార్టీ అధ్యక్షులు మీర్ షౌకత్, కరీంనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆరె రవి గౌడ్, 55వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
