
-జెడ్పీ మీటింగ్ లో తుఫానులా చెలరేగిన ఎమ్మెల్యే కౌశిక్
-డిఈఓ పై కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరిక
-దళిత బంధు నిధులు విడుదల చేయాలన్న కౌశిక్
-కలెక్టర్ ముందే బైఠాయించి ఎమ్మెల్యే నిరసన
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్, జులై2: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యవర్గ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులపై మండిపడ్డారు. పలు అంశాలపై నిలదీశారు. కౌశిక్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అధికారులు వెళ్లిపోయారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంఈఓల బాధ్యతల తొలగింపు అంశాన్ని లేవనెత్తారు. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో పాఠశాలల పనితీరుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎలా వెళ్తారు అంటూ డీఈవో ఎంఈఓ లకు నోటీసు జారీ చేశారు. అలాగే ఎంఈఓలు ఇద్దరిని బాధ్యతలనుండి తొలగించారు. ఈ విషయమై కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ల ముందే గళమెత్తారు. ఒక ఎమ్మెల్యేగా సమీక్ష సమావేశం నిర్వహించే అర్హత తనకు లేదా అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా విద్యార్థులకు మంచి బోధన అందుతుందా లేదా? మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా లేదా? యూనిఫారాలు పుస్తకాలు ఇచ్చారా లేదా? పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయా లేదా? అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు? ఈ విషయమే జిల్లాకు చెందిన మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాల్సింది పోయి.. తాను సమీక్ష నిర్వహిస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయమై శాసనసభ స్పీకర్ ను కలిసి సభ్యుల హక్కుల ఉల్లంఘనపై నోటీసును అందజేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ కూడా స్పందించకుంటే హై కోర్టుకు వెళతానని హెచ్చరించారు. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయములో కూడా తాను పంపిణీ చేయవద్దంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారని కానీ తాను ఈ విషయమై కోర్టుకు వెళ్లానని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్యేలే చెక్కులు పంపిణీ చేయాలని చెప్పిందని ఆయన తెలిపారు. కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ నిరుపేదలైన లబ్ధిదారులపై కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. దళిత జడ్పిటిసి సభ్యుడైన శ్రీరామ్ ను దళిత బంధు డిమాండ్లపై టీ షర్టు వేసుకుని వచ్చాడు అన్న కారణం పై సభలోకి అనుమతించకపోవడం దారుణమని అతన్ని వెంటనే సభలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధు నిధులను విడుదల చేయాలని కూడా కౌశిక్ అధికారులను డిమాండ్ చేశారు. చిగురుమామిడి జెడ్పిటిసి సభ్యుడు గీకురు రవీందర్ లేచి కౌశిక్ రెడ్డిని విమర్శించబోగా బిఆర్ ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారి ప్రశ్నిస్తున్నావా? నీకు మాట్లాడే హక్కు లేదు అంటూ కౌశిక్ మండిపడ్డారు. ఏది ఏమైనా జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో కౌశిక్ రెడ్డి పలు సమస్యలపై అధికారులను నిలదీయడం పట్టుబట్టడం సర్వత్ర చర్చనీయాంశం అయింది. అదను చూసి కౌశిక్ సరియైన అంశాలను ప్రస్తావించి అధికార పక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
జిల్లా పరిషత్ సమావేశంలో దళిత బంధుపై ప్రశ్నించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 20,000 మంది లబ్ధిదారులకు దళిత బంధు మంజూరయిందనీ, ఇందులో మరో మూడు వేల మంది లబ్ధిదారుల వరకు రెండవ విడత డబ్బులు రావాల్సి ఉందనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై నేను గతంలో అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాననీ, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఒక దళిత జెడ్పిటిసి సభ్యుడు దళిత బంధు ఇవ్వాలంటూ టీ షర్టు పై రాసుకొని వస్తే అతన్ని సభలోకి అనుమతించకపోవడం మంచి పద్ధతి కాదనీ వెంటనే ఆ సభ్యున్ని సభలోకి అనుమతించాలన్నారు. ఒక దళితుడనే కారణంతో అతన్ని అనుమతించకపోవడం దారుణమని, ఈ విషయమై జిల్లా పరిషత్ చైర్మన్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప ఉద్దేశంతో అంబేద్కర్ విధానాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. హుజురాబాద్ లో ఒక పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధును తీసుకున్నారనీ. దళిత బంధు రెండవ విడత ఎందుకు అపుతున్నారో అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలనీ కాశిరెడ్డి డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా ఇప్పటికే లబ్ధిదారుల అకౌంట్లో ఉన్నాయనీ అవి వినియోగించుకోకుండా ఎందుకు ఆపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయమై లబ్ధిదారులు కూడా ఎన్నోసార్లు వచ్చి అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు సమర్పించారనీ ఒక్కోసారి లబ్ధిదారులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతున్నారనీ, ఈ విషయమై లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనీ ఈ విషయమే కలెక్టర్ చొరవ తీసుకోవాలనీ కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.











