
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: దేశంలో నూతనంగా ప్రారంభమైన నేరము, శిక్షలపై విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు కనీస అవగాహన కలిగి ఉండాలని హుజురాబాద్ కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పద్మసాయిశ్రీ పేర్కొన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతన శిక్ష చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇటీవలే నూతనంగా వచ్చిన శిక్ష, చట్టాల గురించి తెలుసుకోవాలని అన్నారు. గతంలో ఉన్న భారతీయ శిక్షాస్మృతికి నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత, రెండు కొత్త చట్టాలకి చాలా తేడా ఉందని, కొత్త చట్టంలో గృహ హింస, పొక్సో, బాల్య వివాహాలు, మహిళలపై అత్యాచారం, బాలకార్మికులు వంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నందున విద్యార్థులు నెరాలవైపు కి వెళ్లకుండా చదువుపై దృష్టిపెట్టాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ తిరుమల, మహిళ సాధికారత జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీలత, ఫైనాన్షియల్ లిట్రసి కె.రోహిణి, సఖి లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి, కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
