
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండలంలోని సిర్సపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ వి జనార్దన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిల్లలకు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యత లభించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. దీంతోపాటు గణితంలో కూడా పట్టు వచ్చేలా ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లగానే తమ సెల్ ఫోన్లను ప్రధానోపాధ్యాయునికి ఇవ్వాలని తిరిగి వెళ్లేటప్పుడు మాత్రమే తీసుకోవాలని సూచించారు. పిల్లలకు ప్రభుత్వ అందించే పుస్తకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం సత్యప్రసాద్, హెచ్ఎం విడపు శ్రీనివాస్, సంజీవయ్య, సమ్మయ్య, నాగమణి, అనిత, వెంకటేష్, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.

