
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వం జూదాన్ని నిషేధించినప్పటికీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గము పరిధిలోని జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో ఆ గ్రామ ప్రజా ప్రతినిధియే పేకాట క్లబ్ ను గత కొన్నాళ్లుగా నిర్వహించడం, పలుమార్లు పట్టుబడడం మళ్లీ నిర్వహించడం హుజురాబాద్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశముగా మారింది. శనివారం రాత్రి శంభునిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి పట్టుకోవడం విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శంభునిపల్లికి చెందిన వెంకట్ రెడ్డి ఆ గ్రామ సర్పంచ్ యే గాక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడుగా కూడా ఇటీవలనే పదవి ముగిసింది. అతడు అధికార పార్టీ చెందిన నాయకుడిగా మండలంలో చలామణి అవుతూ తనకు అధికారుల అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న ధీమాతో స్వయంగా తన ఇంట్లోనే పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసి గత కొన్నాళ్లుగా క్లబ్ నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అతడికి ఉన్న వ్యసనాన్ని మానుకోలేక తనకు తోడుగా మరికొందరిని తయారు చసుకొని నిత్యం అక్కడ పేకాట ఆడుతుండడంతో నిన్న రాత్రి అతనితోపాటు తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి రూ.16,510 లు, స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన వారిలో వడ్లూరి రాజేశ్వర్, చింత రమణారెడ్డి, తన్నీరు శీను, మ్యడగోని తిరుపతి, బొడ్డు బాబురావు, గడ్డం శ్రీనివాస్, మండల రాజేందర్ రెడ్డి, కర్నకంటి శ్రీనివాస్ రెడ్డిలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా సదరు క్లబ్ నిర్వాహకుడు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అయి ఉండి ఇప్పటికీ అనేకసార్లు పట్టుబడడం అయినా మళ్లీ కొనసాగించడం పరిపాటిగా మారింది. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పేకాటను అరికట్టాల్సిన పోలీసు సిబ్బంది కూడా తనకు ముందస్తుగా సమాచారం ఇస్తుండడంతో పలుమార్లు జాగ్రత్తలు తీసుకుంటూ పట్టుబడడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. స్థానిక పోలీసులను నమ్మక కొందరు టాస్క్ ఫోర్స్ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చి గతంలో పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అనేకసార్లు పేకాట ఆడుతూ దొరికినప్పటికీ పోలీసులు మాత్రం ఒకే సెక్షన్ కింద కేసు నమోదు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారే కానీ అతనిని పేకాట వ్యసనానికి దూరం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేగాక సమగ్రంగా పేకాటను అరికట్టాల్సిన పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం, వారికీ పేకాట క్లబ్ నుండి అందాల్సినవి అందుతుండడంతోనే ఈ క్లబ్బు గత కొన్నాళ్లుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు సదరు మాజీ ప్రజాప్రతినిధిపై పార్టీ పరమైన చర్యలు తీసుకొని అతని వ్యసనాన్ని రూపుమాపి ఇతరుల జీవితాలు(పేకాట ఆడకుండా) పాడుకాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.







