
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలోని ఎస్సార్ ట్రేడర్స్ మిల్లులో టాస్క్ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని సదరు రైస్ మిల్లు యజమాని పక్కదారి పట్టించినట్లు టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి బాకీ ఉన్న ధాన్యం 14,805 క్వింటాళ్ల ధాన్యం వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించి కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేయగా, బాకీ ఉన్న ధాన్యానికి డబ్బులు లేదా ధాన్యం ఇస్తామని లిఖితపూర్వకంగా ఎస్సార్ ట్రేడర్స్ రైస్ మిల్ ఓనర్ బొబ్బల రాజిరెడ్డి అధికారులకు రాసి ఇవ్వడంతో అధికారులు కొంత గడువు ఇచ్చి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ హుజురాబాద్ పట్టణంలో పలువురు రైస్ మిల్లు యజమానులు సీఎంఆర్ ధాన్యాన్ని యదేచ్చగా సొంతానికి వాడుకొని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుని, తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా లేవీ ఇవ్వకుండా కోట్లాది రూపాయలు కాజేయడం గత కొన్నేళ్లుగా అలవాటుగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే గాని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని పలువురు భావిస్తున్నారు.

