16 మంది ఎంపీలు కలిసి 16 పైసలు కూడా తీసుకురాక పోవడం సిగ్గుచేటు..పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం!.తెలంగాణ కోసం ముఖ్యమంత్రి జంతర్ మంతర్ కు కేసీఆర్ తో వెళ్తే సహకరిస్తాం… ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, బిజెపి, కాంగ్రెస్ తరపున 16 మంది ఏంపీలు గెలిచిన కనీసం 16 పైసలు కూడా తెలంగాణకు తీసుకురాకపోవడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా గురువారం బండ శ్రీనివాస్ తన కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడకుండా తెలంగాణకు రావలసిన నీధులన్నింటిని వచ్చేదాకా పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన ఎంపీలు తెలంగాణకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇకపై తెలంగాణలో ఎంపీలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ముఖ్యమంత్రితో కలిసి ఎంపీలంతా ఏకమై తమ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారని, అలాగే నిధులు రాని పంజాబ్ ఎంపీలు సైతం పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారని అన్నారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినా 16 మంది ఎంపీలు ఏం చేశారని బండ శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు నరేంద్ర మోడీని బడే బాయ్ అని చెప్పుకొచ్చారని అన్నారు. ప్రధానమంత్రిని అంతలా పొగిడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయింపుపై ఎందుకు నిలదీయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టాలని, ఆ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్థమైందని తెలంగాణ గురించి పోరాడేది ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే ప్రజలు గుర్తించారన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామంటూ చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లక్ష లోపు రుణమాఫీ మాత్రమే చేసిందని, అదికూడా పూర్తిస్థాయిలో చేయలేదని, చాలామందికి లక్ష లోపు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకర్ల చుట్టూ రోజు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలు, కొర్రీలు పెట్టి రైతు రుణమాఫీ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. రైతులు రుణమాఫీపై అధికారులను నిలదీస్తే తమకు పూర్తిస్థాయిలో గైడ్ లైన్స్ రాలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బడ్జెట్ తో పాటు ఆరు గారెంటీ లపై స్పందించి పూర్తిస్థాయిలో ప్రజలకు వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు కృషి చేయాలని, ఇప్పటికైనా ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!