Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ ఆరోపించారు. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేషపెట్టిన రాష్ట్ర బడ్జెటుపై అజయ్ స్పందిస్తూ, నాణ్యమైన విద్య అందించడం దేవుడెరుగని, కనీస విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే విద్యార్థుల, నిరుద్యోగుల ఆశలు, ఆశయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు చల్లిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్సుమెంటు, ఉపకారవేతనాలు రూ.7వేల కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయని, సకాలంలో ఫీజులు రాక ఉన్నత విద్యకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామని విద్యార్థులను మభ్యపెడుతూ ప్రభుత్వరంగ యూనివర్సిటీలను పూర్తిగా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడునెలలు కావస్తున్నా, యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్లను నియమించలేని దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. వెంటనే యూనివర్సిటీలకు వీసిల నియామకం చేపట్టాలని, నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెట్ ని పునరాలోచించి, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంట పడుతామని హెచ్చరించారు.






