
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదాయానికి, వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్ అని పేర్కొన్నారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతోందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనని అన్నారు. 6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భ్రుతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది?అని ప్రశ్నించారు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు పైసలు నో బడ్జెట్ అని, కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు = గాడిద గుడ్డే అని విమర్శించారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు = గాడిద గుడ్డే అని పేర్కొన్నారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని, 6 గ్యారంటీలను అమలు చేయలేక కేంద్రాన్ని బదనాం చేసే కుట్రా చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారు, బడ్జెట్ లో 15 వేల కోట్లే కేటాయిస్తారా? అని నిలదీశారు. రైతు భరోసాపై క్లారిటీ లేదు…ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా? అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో 14 మంది నేతన్నలు ఆకలి మరణాలు జరిగినా పట్టించుకోరా? ఆటోడ్రైవర్లకు 12 వేల రూపాయల ఆర్దిక సాయం ఇస్తారా… ఇవ్వరా? అని నిలదీశారు. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 60 వేల ఉద్యోగాలిస్తున్నట్లు చెప్పడం పెద్ద జోక్ అని పేర్కొన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులనేది బోగస్ అని నీధులే కేటాయించకుండా కోటీశ్వరులను ఎట్లా చేస్తారు? అని ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో పామాయిల్ చెట్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ నిధుల్లో కేంద్ర వాటా ఉందా లేదా? అని ప్రశ్నించారు.విద్యకు 7 శాతం, ఆరోగ్య రంగానికి 4 శాతంలోపు కేటాయింపులు చేయడం సిగ్గు చేటు అన్నారు.52 శాతం బీసీ జనాభా సంక్షేమానికి 3.5 శాతం (9 వేల 200 కోట్లు) నిధులే ప్రతిపాదిస్తారా? అని నిలదీశారు. దళిత సంక్షేమంలో భారీ కోత విధించి దళితులకు అన్యాయం చేశారనీ ఆరోపించారు. గతేడాది కంటే ఈసారి ఎక్సైజ్ ద్వారా 6 వేల కోట్ల అదనపు ఆదాయంతో కేసీఆర్ కు ఇష్టమైన మద్యాన్ని ఏరులై పారించాలనుకుంటున్నారని బండి ఆరోపించారు. కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో వేల కోట్ల నిధులు మురిగిపోయింది నిజం కాదా? అన్నారు. కేంద్రం నిధులిస్తున్న పథకాలకు ప్రధానమంత్రి ఫొటో పెట్టి తీరాల్సిందేనని, లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గం అని, కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు తప్పదనీ బండి హెచ్చరించారు. సీఎం తీరు తెలంగాణకు పెద్ద నష్టం తెచ్చిపెడుతుందన్నారు. భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రికి ముఖం చెల్లకనే నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు అని బండి ఆరోపించారు. పచ్చి అబద్దాలతో కేంద్రాన్ని బదనాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని, పిల్లర్లు దెబ్బతిన్నాయని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది కదా? అని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులు అని పేర్కొన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా? అన్నారు. అవకాశమొస్తే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయం అని బండి సంజయ్ ఆరోపించారు. లోలోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఆలింగనం చేసుకుంటున్నారనీ, బయటకొచ్చి తిట్టుకుంటున్నారని బండి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల వార్నింగులను జనం అసలు పట్టించుకోవడమే లేదని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు హీరోల్లా కొట్లాడుతుంటే, తట్టుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కైనయ్ అనే బండి ఆరోపించారు. మూసీ రివర్ ఫ్రంట్ నిధులడిగిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎందుకు భారీ నిధులు కేటాయించలేదో సమాధానం చెప్పలేదు? అని అన్నారు. కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ నాస్తికుడు అని, హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నడు అని పేర్కొన్నారు. దేవుడిని అవమానించడం తప్ప బీఆర్ఎస్ నేతలు సాధించిందేమిటి? అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తక్షణమే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర నాయకులు ఝాన్సీ రాణి, రమేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







