
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మందబలం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారనీ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీష్ రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా, క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని పారిపోయారనీ, ఇది చాలా దుర్మార్గం అన్నారు. ఉదయం నేను మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉదయం పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా రూ. 9 వేల కోట్లు రుద్దింది అని చెప్పాను అన్నారు. మీటర్లు పెడుతున్నట్లు సంతకాలు పెట్టినం అని వెంటనే సీఎం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సీఎం చెప్పిన నోట్ జనవరి 4, 2017 నాటిది.. ఇందులో ఏముందంటే వ్యవసాయ బోరు బావుల కాడ స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ముచ్చట ఉంది తప్ప, మీటర్లు అనే ముచ్చటే ఇందులో లేదు అన్నారు. నేను చెబుతున్న నోట్.. జూన్ 9, 2021 నాటిది అని, ఇందులో ఏముందంటే, ఏ రాష్ట్రాలైతే 0.5% అప్పు తీసుకోవాలనుకుంటున్నయో మీ ప్రతిపాదనలు పంపండి మేము మీకు వరుసగా ఇస్తమన్నరు.. మేము చేరము అన్నాము.. ఈ విషయం నేను చెప్పిన సభలో పట్టించుకోవడం లేదన్నారు. నాలుగేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి రూ. 30 వేల కోట్లు వచ్చేవనీ, కాని రైతుల ప్రయోజనాల కోసం మేం అందుకు ఒప్పుకోలేదన్నారు. ఆనాడే రూ. 30 వేల కోట్లు వదులుకున్నం.. ఇదే మేం చెప్పినం కానీ రేవంత్ రెడ్డి మాత్రం సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారన్నారు. మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారనీ హరీష్ రావు ఆరోపించారు. నేను చెప్పింది ఒకటి ముఖ్యమంత్రి మాట్లాడింది ఒకటి అన్నారు. మందబలం ఉందని సీఎం తప్పుగా చెబుతున్నారన్నారు. బోడి గుండుకు మోకాలుకు లింక్ పెట్టారని ఆరోపించారు. సభా నాయకుడు అని మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నరేమో అనుమానంగా ఉందన్నారు. ఇప్పటికి మేము కనీసం స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదని, రైతులు ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు జి జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేకనంద తదితరులు పాల్గొన్నారు.






