
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రూ.1000 కోట్లు మంజూరు చేయించే దమ్ము ఉందా.. అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు. కరీంనగర్ నియోజకవర్గంపై నిజంగా నీకు ప్రేమ ఉంటే వెయ్యికోట్ల కీలకమైన ప్రాజెక్టు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఇలా చేస్తే కొట్లాడీ తెచ్చారని ప్రజలు భావిస్తారని హితవు పలికారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి పనులు చేస్తే దాన్ని అభివృద్ధి అనరని స్పష్టం చేశారు. ప్రజలు చెల్లిస్తున్న 100% పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం 49 శాతం రాష్ట్రానికి కేటాయిస్తున్నదని తెలిపారు. వీటిని కూడా తమ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని జబ్బలు చర్చుకోవడం సరైనదిగా లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆవాస్ యోజన, హర్గర్ జల్ యోజన, పీఎం జెన్ ఆరోగ్య యోజన, పీఎం మత్స్స సంపద యోజన, అటల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ యోజనతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల కింద కరీంనగర్ నియోజకవర్గంలో 10,000 మంది కైనా చేకూర్చారా చేకూర్చావా అని ప్రశ్నించారు. ఎంతమంది అం దించారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనేక పథకాలు అమలవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ పథకాలను పేదలకు అందించడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గుండు సున్నా పెట్టిందని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శాసనసభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తీర్మానం చేస్తే మీరెందుకు వణుకుతున్నారని బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఒక్క బడ్జెట్ పూర్తయిందని, మరో నాలుగు బడ్జెట్లే మిగిలి ఉన్నాయని, కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ అభివృద్ధి నిరోధకులుగా మారవద్దని, కేంద్ర మంత్రి పదవీలో ఉన్నారు గనుక ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెల్లారి లేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దని, చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు సాధించాలని హితవు పలికారు. పామ్ ఆయిల్ సాగులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే కరీంనగర్ కు ట్రిపుల్ ఐటి, నవోదయ, కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి యూజీసీ నుంచి రూ.1000 కోట్లు మంజూరు చేయించాలని సూచించారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల సంక్షేమానికి మెగా టెక్సటైల్ క్లస్టర్ మంజూరు చేయించాలని, వారికి నిరంతరం ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషించాలని పేర్కొన్నారు. అదేవిధంగా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి అదనంగా ఓ రూ.2000 కోట్లు తెప్పించాలని,, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులకు అదనంగా నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మనోహరాబాద్ టు హైదరాబాద్, సిద్దిపేట టు సిరిసిల్ల వేములవాడ, కొత్తపల్లి రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలని వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కుమార్ కు సూచించారు. వేములవాడ, కొండగట్టు దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున కృషి చేయాలని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జన రంజకమైన బడ్జెట్ రూపొందించారని, కేంద్రం వంచించినా రాష్ట్రం ఆదుకుంటుందని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమార్ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, రెండోసారి ఎంపీగా గెలిచినందుకు వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధి విరోధకులుగా మారవద్దని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణమైన సూచనలు అందించాలని వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కుమార్ కు సూచించారు.






