- ఫలించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ కృషి
- ఆగస్టు ఫస్ట్ నుంచి హైదరాబాద్ కు బస్సు సర్వీస్
- ‘స్వర్ణోదయం వార్తకు స్పందన’
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట నుండి హైదరాబాదుకు ప్రత్యేకంగా బస్సు నడిపేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఓడితెల ప్రణవ్ తెలిపారు. జమ్మికుంట నుంచి హైదరాబాదుకు ప్రత్యేకంగా బస్సులు లేకపోవడంతో జమ్మికుంటకు చెందిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్వర్ణోదయం డిజిటల్ దినపత్రికలో ఇటీవల ప్రచురితం కావడంతో ఈ సమస్యను ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు. దీంతో పొన్నం తక్షణమే స్పందించి ఆర్టిసి అధికారులతో మాట్లాడి జమ్మికుంట నుండి హైదరాబాద్ కు గతంలో నడిపిన మాదిరిగానే బస్సులను ఉదయం, మధ్యాహ్నం బస్సులు నడిపించాలని ఆర్టిసి ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే జమ్మికుంటకు నడుపుతున్న మినీ బస్సుల స్థానంలో కొత్త బస్సులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జమ్మికుంట ప్రాంత ప్రజల రవాణా అవసరాలను గుర్తించి ‘స్వర్ణోదయం డిజిటల్ దినపత్రిక’లో ప్రచురించిన వార్తను ఆర్టిసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేలా, రవాణా శాఖ మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు, స్వర్ణోదయం దినపత్రికకు జమ్మికుంట ప్రాంత ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.